దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో అజాద్ పాత్ర అద్వితీయం : కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా : ఘనంగా భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి
మదనపల్లె,మేజర్ న్యూస్ : భారతదేశ విద్యా రంగానికి,దేశస్వాతంత్ర్య ఉద్యమానికి ఆజాద్ సేవలు ఎనలేనివని,కొనియాడుతూ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా పేర్కొన్నారు.బుధవారం స్థానిక అగర్త వీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ప్రముఖ వైద్యులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ అప్సర్ షరీఫ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ చిన్నతనం నుంచే విద్యపై ఎంతో ఆసక్తి కనబరిచిన ఆజాద్ అరబిక్,ఉర్దూ,పర్షియన్,హిందీ భాషల్లో ప్రావీణ్యం సంపాదించి గొప్ప పండితుడిగా,రచయితగా,పాత్రికేయుడిగా గుర్తింపు పొందారన్నారు.బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారని పేర్కొంటూ,మహాత్మా గాంధీతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని పలుమార్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించారని గుర్తుచేశారు.భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి,1947 నుంచి 1958 వరకు విద్యారంగ అభివృద్ధికి విశేష సేవలందించారన్నారు. ఆయన కృషితో దేశంలో ఉన్నత విద్య,సాంకేతిక విద్య,సాంస్కృతిక రంగాల అభివృద్ధికి పునాదులు పడటంతోపాటు ఐఐటీ ఖరగ్ పూర్,యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్,భారత సాంస్కృతిక సంబంధాల మండలి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.అలాగే ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.అదేవిధంగా త్వరలో జరగబోవు సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజాదరణ ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీతోనే రాష్ట్ర,దేశ భవిష్యత్తు ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి ప్రధాన కార్యదర్శి సయ్యద్ సమీరుద్దీన్,డిసిసి మహిళా అధ్యక్షురాలు మల్లికా,వాల్మీకిపురం మహిళా నాయకురాలు బాలసుధ,గుర్రంకొండ మైనార్టీ మండల అధ్యక్షులు ఖాజా మహమ్మద్ హుస్సేన్,షమీం షేక్,సబీనా నాజనిన్,తాజ్ ఉన్నీషాలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కే.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి