పుట్టినరోజు సందర్భంగా కంచాలు విద్యాసామాగ్రి పంపిణీ
గోపాలపురం, నవంబరు 11 మేజర్ న్యూస్ : ఆడంబరాలకు దూరంగా పుట్టినరోజు వేడుకను సేవా కార్యక్రమంగా మలుచుకుని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలిచారు గుబ్బా స్వాతి. గోపాలపురం మండలం ఉప్పరగూడెంలోని మండల పరిషత్ ప్రాథమిక ప్రత్యేక పాఠశాలలో 'మానవత' స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ పూర్వ అధ్యక్షులు గుబ్బా లక్ష్మణరావు సతీమణి స్వాతి పుట్టినరోజును పురస్కరించుకుని 50 మంది విద్యార్థులకు 'డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం' కోసం స్టీలు కంచాలు, విద్యా సామగ్రి (నోట్‌బుక్స్, పెన్నులు) పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి ఏ. మహేశ్వరరావు, మానవత మండల అధ్యక్షులు యండపల్లి శేఖర్‌బాబు, చైర్మన్ జొన్నలగడ్డ రాంబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో దాతల భాగస్వామ్యం అభినందనీయమని, విద్యార్థులకు అవసరమైన సాయం అందించడం సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వ్యక్తిగత వేడుకను సామాజిక బాధ్యతగా మార్చిన స్వాతి-లక్ష్మణరావు దంపతులను పలువురు కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు బోడా వెంకటలక్ష్మి, మానవత ప్రతినిధులు కుక్కల కీర్తికుమార్, త్రిమూర్తులు, గడ జోగేంద్ర ప్రసాద్, పీడీ ముప్పిడి నాగమణి, సీఆర్‌పీ కొయ్య నాగరాజు, ఉపాధ్యాయులు, మానవత సభ్యులు పాల్గొన్నారు.