ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజాసేవలో నిమగ్నమైన నూతన చైర్ పర్సన్ పద్మావతి *
నర్సీపట్నం నవంబర్ 4 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం మున్సిపాలిటీ నూతన చైర్ పర్సన్ గా గెలుపొందిన పద్మావతి చింతకాయల గెలిచిన మరుసటి రోజే తన కార్యదక్షతను చాటుకున్నారు. ఇంకా ఆమె అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయకముందే ప్రజాసేవలో నిమగ్నమై ఆదర్శంగా నిలిచారు. తుఫాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు నర్సీపట్నంలోని వెంక నాయుడుపేట ప్రాంతంలో కాలువలు పొంగిపొర్లుతున్నాయని స్థానికుల నుంచి వచ్చిన ఒక ఫోన్ కాల్ కు ఆమె తక్షణం స్పందించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వర్షాన్ని సైతం లెక్కచేయకుండా హుటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ కాలువల పరిస్థితిని స్వయంగా పరిశీలించి, కాలువలలో నీటి ప్రవాహానికి ఆటంకం ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతుందో స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచే మున్సిపాలిటీ శానిటరీ ఇన్స్పెక్టర్ కు ఫోన్లో మాట్లాడి, వెంటనే సిబ్బందిని పంపించి కాలువల్లో నీరు సాఫీగా వెళ్లేలా తక్షణ పరిష్కారం చూపాలని ఆదేశించారు. పదవి చేపట్టి అధికారికంగా బాధ్యతలు స్వీకరించకముందే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఆమె చూపిన ఈ చొరవ మరియు అంకితభావాన్ని చూసి స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.