ప్రజల భద్రతే లక్ష్యం.. నేరరహిత సమాజ నిర్మాణమే ధ్యేయం -జిల్లా ఎస్పీ డా.అజిత వెజెండ్ల.ఐపీఎస్.
నెల్లూరు, అర్బన్,క్రైమ్, మేజర్ న్యూస్ : దేశ భద్రత, ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ అమరులైన పోలీసు వీరుల త్యాగాలు దేశ చరిత్రలో చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల పేర్కొన్నారు.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం-2026ను పురస్కరించుకుని బుధవారం నెల్లూరు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని పెరేడ్ గ్రౌండ్లో స్మృతి పెరేడ్ నిర్వహించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ముఖ్య అతిథిగా హాజరుకాగా, జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్లతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దేశ భద్రతకు పోలీసులు వెన్నెముక వంటివారని, విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా, సురక్షితంగా జీవించేందుకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పది మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు వివరించారు.జిల్లా ఎస్పీ డాక్టర్ అజిత వెజెండ్ల మాట్లాడుతూ ప్రజల భద్రతే లక్ష్యంగా, నేరరహిత సమాజ నిర్మాణమే ధ్యేయంగా జిల్లా పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు.యూనిఫాం ధరించడం ఒక బాధ్యత అయితే, ప్రజలకు భద్రత కల్పించడం పవిత్రమైన కర్తవ్యమని పేర్కొన్నారు.మాదకద్రవ్యాల నిర్మూలన, మహిళలపై అఘాయిత్యాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా ఆపరేషన్ త్రిశూల్‌ను సమర్థవంతంగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు.పోలీసు విధి నిర్వహణ ఎంతో శ్రమతో కూడుకున్నదని, ఇతర ఉద్యోగాల మాదిరిగా నిర్దిష్ట గంటలకే పరిమితం కాకుండా 24 గంటలూ ప్రజల రక్షణ కోసం పోలీసులు అందుబాటులో ఉండాల్సి వస్తుందని ఎస్పీ పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.ఈ ఏడాది దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీసుల వివరాలను అడిషనల్ ఎస్పీ (ఏఆర్) పి.వి. అప్పారావు చదివి వినిపించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిపారు.అనంతరం అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు, అమరవీరుల కుటుంబ సభ్యులు పూలమాలలు ఉంచి రెండు నిమిషాలు మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు.అమరవీరుల కుటుంబాలకు వెల్ఫేర్ ఫండ్, హ్యుమానిటేరియన్ కార్పస్ ఫండ్ చెక్కులతో పాటు ప్రత్యేక మెమెంటోలను అందజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ అజిత వెజెండ్ల జెండా ఊపి అమరవీరుల సంస్మరణ ర్యాలీని ప్రారంభించారు. పోలీసు పెరేడ్ గ్రౌండ్ నుంచి కేవీఆర్ పెట్రోల్ బంకు వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్న పోలీసులు అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నినాదాలు చేశారు.అమరవీరులకు నివాళులర్పించే సమయంలో కురిసిన భారీ వర్షం కార్యక్రమానికి భావోద్వేగ వాతావరణాన్ని తీసుకొచ్చింది.అమరవీరుల త్యాగాలకు ప్రకృతి సైతం నివాళులర్పించినట్లుగా ఈ దృశ్యం పలువురిని కదిలించింది. అనంతరం ఎస్పీ ఆదేశాల మేరకు విధి నిర్వహణలో మరణించిన తొమ్మిది మంది పోలీసు అధికారుల కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వారికి అందే ప్రయోజనాలు, సంక్షేమ పథకాల వివరాలను తెలియజేసి, పోలీసు శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.స్మృతి పెరేడ్‌ను ఆర్ఐ (ఎంటీఓ) హరిబాబు ఆధ్వర్యంలో నెల్లూరు పోలీసులు క్రమశిక్షణతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) సీహెచ్. సౌజన్య, అడిషనల్ ఎస్పీ (ఏఆర్) పి.వి. అప్పారావు, టౌన్ ఏఎస్పీ దీక్ష ఐపీఎస్, రూరల్, డీటీసీ, హెచ్‌జీ, ఏఆర్ డీఎస్పీలు, ఎస్బీ, టౌన్, పీసీఆర్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఇతర పోలీసు అధికారులు, అసోసియేషన్ సభ్యులు, డీపీఓ సిబ్బంది, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.