ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్ : కేంద్రంలోని బీజేపీ–ఎన్డీయే ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ, నిరంకుశ విధానాలను అవలంబిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల ఓటు హక్కును తొలగించడం దారుణమని మండిపడ్డ ఆయన, ఓట్ల తొలగింపును వెంటనే నిలిపివేసి పాత ఓట్లను పునరుద్ధరించాలని, ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఎన్నికల సంఘం తీరుకు వ్యతిరేకంగా యువత, ప్రజాసంఘాలు, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా స్పందించకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎన్నికల కమిషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేసేంతవరకు దేశవ్యాప్తంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ, ప్రజలందరూ ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు.