పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం
పొదలకూరు పోలేరమ్మ జాతరకు మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి ఆహ్వానం
అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో వైభవంగా జాతర మహోత్సవాలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : పొదలకూరు గ్రామదేవత, శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతర కమిటీ సభ్యులు ఆదివారం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని సంప్రదాయబద్ధంగా కలిసి జాతర మహోత్సవాలకు ఆహ్వానించారు.అక్టోబర్ 6, 7, 8 తేదీల్లో మూడు రోజుల పాటు శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు మంత్రికి వివరించారు. జాతరలో నిర్వహించనున్న ప్రత్యేక పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సంప్రదాయ వేడుకలకు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని మంత్రిని కోరారు.ఈ సందర్భంగా జాతర కమిటీ సభ్యులు మంత్రికి పండ్లు, పుష్పాలతో కూడిన తాంబూలాన్ని సమర్పించి, శాలువాతో సత్కరించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. గ్రామదేవత పోలేరమ్మ జాతర పొదలకూరు ప్రాంత ప్రజలకు అత్యంత విశిష్టమైన ఆధ్యాత్మిక, సాంస్కృతిక వేడుకగా నిలుస్తుందని వారు తెలిపారు.జాతరను ప్రశాంత వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు.