పంట నష్టంపై సర్వే
పంట నష్టాలపై తక్షణ సర్వే
దెబ్బతిన్న రోడ్లకు అత్యవసర మరమ్మతులు : మంత్రి అచ్చెన్నాయుడు
ఏపీ స్టేట్ బ్యూరో, సూర్య ప్రధాన ప్రతినిధి: తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు, ఈదురు గాలుల వల్ల జరిగిన పంట నష్టాన్ని తక్షణమే అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల నష్టాన్ని నమోదు చేసి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లో రైతులు, ప్రజలకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు, జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. భారీ వర్షాల పరిస్థితులపై వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బూడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ కమిషనర్ జిలానీ, ఉద్యాన శాఖ కమిషనర్ శ్రీనివాసులు, పశుసంవర్ధక, మత్స్యశాఖల ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్వతీపురం మన్యం, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లతోనూ పరిస్థితులను సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు జరిగిన నష్టంపై క్షేత్రస్థాయిలో వెంటనే సర్వే నిర్వహించి, నష్ట వివరాల నమోదు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించడంతో పాటు అధిక తేమ కారణంగా పంటలకు మరింత నష్టం కలగకుండా రైతులకు సాంకేతిక సూచనలు అందించాలని తెలిపారు. పంటల రక్షణ చర్యలపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.
వర్షాలు, గాలులకు దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల వివరాలను వెంటనే నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించే ప్రధాన రహదారులకు ప్రాధాన్యం ఇచ్చి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని సూచించారు. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సహాయక, పునరుద్ధరణ చర్యలను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం లభిస్తున్న వర్షపు నీటిని సాధ్యమైనంత మేర సంరక్షించుకోవాలని మంత్రి సూచించారు. చెరువులు, జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో నీటిని నిల్వ చేసి భవిష్యత్తు సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. పంటలకు హాని కలిగించే నిల్వ నీటిని తొలగిస్తూనే, అనువైన ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణకు చర్యలు చేపట్టాలని తెలిపారు.