యూపీలోని బహ్రైచ్‌లో చిరుతపులి దాడి.. పొలంలో పని చేసుకుంటున్న మహిళ దుర్మరణం
సూర్య జాతీయ డెస్క్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బహ్రైచ్ జిల్లాలో చిరుతపులి స్వైరవిహారం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. కతర్నియాఘాట్ వన్యప్రాణి విభాగం పరిధిలోని సుజౌలి పోలీస్ స్టేషన్ పరిధి గడేరియన్‌పూర్వా గ్రామంలో గురువారం సాయంత్రం దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఇంటి సమీపంలోని పొలంలో కూరగాయలు కోస్తున్న మమతా దేవి అనే మహిళపై చెరకు తోటలో మాటువేసిన చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది. ఊహించని రీతిలో జరిగిన ఈ మెరుపు దాడిలో తీవ్ర రక్తస్రావమై ఆ మహిళ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటనతో స్థానిక గ్రామంలో తీవ్ర విషాదం, భయాందోళనలు అలుముకున్నాయి.
బాధితురాలు పొలంలో పని చేసుకుంటుండగా పొరుగున ఉన్న చెరకు తోట నుంచి చిరుతపులి ఒక్కసారిగా దూసుకువచ్చి ఆమె మెడ, భుజంపై పంజా విసిరినట్లు గ్రామస్తులు తెలిపారు. మమతా దేవి ఆర్తనాదాలు విన్న ఆమె అత్త బాదామీ దేవి కేకలు వేయడంతో చుట్టుపక్కల రైతులు, స్థానికులు కర్రలతో అప్రమత్తమై అక్కడికి పరుగులు తీశారు. జనం పెద్ద ఎత్తున కేకలు వేస్తూ తరలిరావడంతో చిరుతపులి మృతదేహాన్ని వదిలి పొలాల్లోకి పారిపోయింది. మృతురాలి భర్త రాజేంద్ర చౌహాన్ రాజస్థాన్‌లో కూలీ పనులు చేస్తుండగా, వీరికి ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లి హఠాన్మరణంతో ఆ పసిపిల్లలు రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
సమాచారం అందుకున్న సుజౌలి పోలీసులు, అటవీ శాఖ బృందాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తోందని, గత నెల రోజుల్లోనే వన్యప్రాణుల దాడుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పొలాల వైపు వెళ్లాలంటేనే స్థానిక రైతులు, కూలీలు వణికిపోతున్నారు.
ఈ ప్రాంతంలో చిరుతపులి కదలికలను కనిపెట్టేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు కతర్నియాఘాట్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా పొలాల్లోకి వెళ్లవద్దని, సమూహాలుగా మాత్రమే వెళ్లాలని అధికారులు సూచించారు. వన్యప్రాణిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక నిఘా కెమెరాలు అమర్చుతున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. ప్రాణాలు పోకముందే చిరుతను వెంటనే పట్టుకుని బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.