పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు..
పింఛన్ల పంపిణీలో కీలక మార్పులు..
ఇకమీదట కేంద్రం వాటా ఖాతాల్లోకి..
రాష్ట్రంవాటా కింద నగదు నేరుగా ఇంటికే..
డిబీటి ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో కేంద్రం నిధులు జమ..
సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే రాష్ట్ర నిధులు అందజేత..
నగదు పంపిణీలో ఎలాంటి కోతలేదు..
పారదర్శకత కోసమేనంటూ ప్రభుత్వం స్పష్టం..
అక్టోబరు1 నుంచి కొత్త విధానం అమల్లోకి రానున్న వైనం..
నెల్లూరు, మేజర్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వయోవృద్ధులు.. వితంతువులు.. వికలాంగులు.. దివ్యాంగుల తోపాటు శాశ్విత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగుల సామాజిక భద్రత దృష్ట్యా ప్రభుత్వం అమలు చేస్తున్న పింఛన్ల పంపిణీ విధానంలో అత్యంత కీలకమైన కొత్త మలుపు చోటు చేసుకోను న్నట్లు తెలుస్తోంది. నేషనల్ సోషల్ అసెస్టెన్స్ ప్రోగ్రామ్ కింద అమలవుతున్న సామాజిక పింఛన్ల పంపిణీ కార్యాచరణ ప్రక్రియను.. ఇక మీదట రెండు వేరువేరు విధానాల ద్వారా నిర్వహించాలని కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ పద్ధతి ద్వారా తన వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద కేటాయించిన నిధులను ఎప్పటిలాగే ప్రతినెల 1 ఆయా ప్రాంతాల్లోని సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్దకే వెళ్లి నగదు రూపంలో పింఛన్ డబ్బులు అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం వల్ల అర్హులైన లబ్ధిదారులకు అందించే పూర్తిస్థాయి మొత్తంలో ఎలాంటి తగ్గింపులు ఉండవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అయితే సాంకేతికపరమైన మార్పుల పేరిట కేంద్ర ప్రభుత్వం తీసుకున్న డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్ విధానంతో కూడిన నిర్ణయం వెనుక రాజకీయ ప్రాధాన్యత ఉందనే అభిప్రాయాలతో కూడిన చర్చలకు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండు విధాలుగా పింఛన్ల చెల్లింపు.…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటినుండి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి పింఛన్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1న ఒకేసారి లబ్ధిదారులకు చెల్లిస్తూ వస్టోంది. అయితే ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సామాజిక భద్రత పథకాలు సంబంధించిన విధుల బదిలీల్లో మరింత పారదర్శకతతో కూడిన వేగం పెంచాలనే ఉద్దేశంతో ఎస్ఎస్ఏ- స్పర్స్ విధానాన్ని అమలులోకి తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధానం ప్రకారం జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం పరిధిలోని పింఛన్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన వాటాను నేరుగా లబ్ధిదారుల ఆధార్ కార్డుతో అనుసంధానం చేయబడిన బ్యాంకు ఖాతాల్లోకి డి బి టి ద్వారా నగదు జమ చేయనుంది. కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న రెండు కీలక నిర్ణయాల దృష్ట్యా ఇకమీదట కొంత మొత్తం బ్యాంకు ఖాతాల్లోనూ.. మిగిలిన సొమ్మును పింఛన్ల రూపంలో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చేతికి అందించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
బ్యాంక్ ఖాతాలో జమ ఎంత...
లబ్ధిదారుల చేతికి అందించేది ఎంత…
60 నుంచి 79 సంవత్సరాల వరకు వయోపరిమితి కలిగిన వృద్ధులకు ప్రతి నెల సామాజిక భద్రత కింద అందించే రూ 4000 పింఛన్ సొమ్ములో నుంచి కేంద్రం మాట కింద రూ 200 లబ్ధిదారుని బ్యాంకు ఖాతాలో జమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద అందించే రూ 3,800 సచివాలయ సిబ్బంది ద్వారా నేరుగా ఇంటి వద్దకే వెళ్లి లబ్ధిదారులకు నగదు రూపంలో పింఛన్ అందజేయబడుతుంది. అదేవిధంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు కేంద్రం వాటా కింద ప్రతినెల రూ 500 బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. రాష్ట్రం వాటా కింద రూ3500 నగదు రూపంలో నేరుగా చేతికి అందజేయడం జరుగుతుంది. అలాగే 40- 79 ఏళ్ల వయసు కలిగిన వితంతు పెన్షన్ మొత్తం రూ 4000లో కేంద్రం మొటా కింద రూ 300 బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. రాష్ట్రం మాట కింద మిగిలిన రూ 3700 నగదు రూపంలో నేరుగా లబ్ధిదారురాలి చేతికి అందించబడుతుంది. 80 ఏళ్లు పైబడిన వితంతువులకు సంబంధించి కేంద్రం వాటా కింద ప్రతినెల రూ 500 బ్యాంకు ఖాతాలో జమ చేయబడతాయి. రాష్ట్రం వాటా కింద మిగిలిన
రూ.3500 నగదు రూపంలో చెల్లించడం జరుగుతుంది. అదేవిధంగా 18-79 సంవత్సరాలు వయసు కలిగిన దివ్యాంగులకు అందించే పింఛన్ మొత్తం రూ 6000 లో కేంద్రం ఓటా కింద రూ 300 బ్యాంకులో జమ చేయబడుతుంది. రాష్ట్రం వాటా కింద రూ 5700 నగదు రూపంలో నేరుగా అందజేయబడుతుంది. 80 సంవత్సరాలు పైబడిన దివ్యాంగులకు అందించే పింఛన్ లో కేంద్రం వాటా కింద రూ 500 బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వంవాటా కింద
రూ5500 నగదు రూపంలో లబ్ధిదారులకు నేరుగా అందజేయబడుతుంది.
పింఛన్ తగ్గిపోతుందన్న అపోహలు వద్దు..
అక్టోబర్ 1 నుంచి అమలులోకి కొత్త విధానం ద్వారా నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది అందజేసే పింఛన్ తాలూకు నగదులో డబ్బులు తగ్గుతాయన్న అపోహలు వద్దని.. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం ద్వారా లబ్ధిదారుల ఖాతాలోకి నేరుగా నగదు చేయడం భద్రతలో ఒక భాగమేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. పింఛన్ లబ్ధిదారులు ఎలాంటి సందేహాలు..అపోహలు పెట్టుకోకుండా ప్రతినెల తమ బ్యాంకు ఖాతాలోని నగదు తాలూకు నిల్వలను సరిచూసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వం వాటా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్న నేపథ్యంలో.. ఆయా బ్యాంకు ఖాతాలకు సంబంధించి ఆధార్ నెంబర్ సీలింగ్.. మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి అయ్యిందా.. లేదా.. అన్న విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి సరిచూసుకోవాలని.. బ్యాంకు ఖాతా యాక్టివ్ గా ఉండటం తోపాటు ఆధార్ అనుసంధానం సక్రమంగా ఉంటేనే కేంద్రం వాటా తాలూకు నగదు డిబీటి కింద ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుందని అధికారులు సూచిస్తున్నారు. పింఛన్ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలు మూసి వేయబడి ఉండటం.. నిష్క్రమణ చేయబడి ఉండటం.. ఆధార్ అనుసంధానంలో సమస్యలు ఉండటం.. కారణాల వల్ల కూడా కేంద్ర ప్రభుత్వం వాటా కింద నగదు జమ కాకపోవచ్చు అని అధికారులు చెబుతున్నారు.
కేంద్రం- రాష్ట్రం మధ్య క్రెడిట్ చర్చ…
సామాజిక పింఛన్ల విషయంలో కేంద్రం వాటాను నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి జమ చేయాలన్న నిర్ణయంపై.. రాజకీయ వర్గాల్లోనూ మొదలైన చర్చలు జోరుగా సాగుతున్నాయి. నిధుల బదిలీల్లో పారదర్శకత పెంచడమే లక్ష్యమని అధికారిక వర్గాలు చెబుతున్నప్పటికీ.. కేంద్రం తనవంతుగా అందిస్తున్న వాటా లబ్ధిదారులకు కనిపించేలా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎలా ఉందో స్పష్టమవుతుందని రాజకీయ వర్గాల విశ్లేషకులు తమ అభిప్రాయాలను వెలుబుచ్చుతున్నారు. గతంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ తమ వాటాలను కలిపి ఒకేసారి పింఛన్ లబ్ధిదారులకు పంపిణీ చేయడంతో.. కేంద్రం అందిస్తున్న వాటా ఎంత అన్నది లబ్ధిదారులకు తెలియని అయోమయ పరిస్థితి ఉండేది. ఈ క్రమంలో అక్టోబర్ 1 నుంచి కేంద్రం వాటా కింద నగదు నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ కానుండటం తో ఈ వివరాలు స్పష్టంగా తెలియనున్నాయి. ఈ నేపథ్యంలో పింఛన్లకు సంబంధించిన వాటాల విషయమై కేంద్ర.. రాష్ట్ర ప్రభుత్వాల మధ్య క్రెడిట్ అంశం రాజకీయ మేధావుల్లో చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.