పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు శిశుగృహానికి అప్పగించాలి
పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు శిశుగృహానికి అప్పగించాలి
*జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి ఎస్. వసంత బాయి
తిరుపతి బ్యూరో,మేజర్ న్యూస్ :
పిల్లలను పెంచలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులు తమ చిన్నారులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపై, డ్రైనేజీలలో లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలివేయకుండా, నిర్భయంగా శిశుగృహానికి అప్పగించాలని జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ సాధికారత అధికారిణి ఎస్. వసంత బాయి విజ్ఞప్తి చేశారు.
ఆదివారం గుర్తుతెలియని వ్యక్తులు ఒక శిశువును చెత్తకుప్పలో వదిలివేసిన ఘటన నేపథ్యంలో సోమవారం ఆమె ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు.
అనాథలు, తల్లిదండ్రులచే వదిలివేయబడిన పిల్లలు, అలాగే వివిధ కారణాల వల్ల చిన్నారులను పెంచలేని పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రుల కోసం ఎం.ఆర్. పల్లిలోని శిశుగృహం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆరేళ్లలోపు చిన్నారులకు ఇక్కడ అవసరమైన సంరక్షణ కల్పిస్తామని పేర్కొన్నారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లు, డ్రైనేజీలు, చెత్తకుప్పలు లేదా నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలివేయరాదని, శిశుగృహానికి సురక్షితంగా అప్పగించాలని కోరారు. శిశుగృహంలో సంరక్షణ పొందుతున్న పిల్లలను ప్రభుత్వ నిబంధనలు, చట్టపరమైన విధానాలకు అనుగుణంగా దత్తత ప్రక్రియ ద్వారా అర్హులైన దంపతులకు అప్పగించడం జరుగుతుందని వివరించారు. సంతానం లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత కోసం కేరింగ్స్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
అలాగే, ఎక్కడైనా అనాథగా లేదా సంరక్షణకు నోచుకోకుండా ఉన్న చిన్నారుల సమాచారం తెలిసిన వారు వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు. సమాచారం అందిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది స్పందించి, చిన్నారులను సురక్షితంగా సంరక్షణలోకి తీసుకునేందుకు అవసరమైన చర్యలు చేపడతారని తెలిపారు.
ఈ విషయాన్ని జిల్లా బాలల సంరక్షణ విభాగం మహిళా సంరక్షణ కార్యదర్శుల దృష్టికి తీసుకువచ్చినా, సంబంధిత అధికారులు సమన్వయంతో తగిన చర్యలు చేపడతారని జిల్లా అధికారిణి ఎస్. వసంత బాయి పేర్కొన్నారు.
Raaju బ్యూరో, తిరుపతి జిల్లా,