పెండింగ్ మున్సిపాలిటీ ల్లో ఎన్నికలు
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలో గ్రామపంచాయతీలకు, పెండింగ్‌లో వున్న గూడూరు, కావలి, అల్లూరు మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేట అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఈ వీడియో కాన్పరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ.. పంచాయతీ, పెండింగ్‌లో వున్న మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు చెప్పారు. నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఓటర్లకు అనుకూలంగా ఉండేలా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు, సిసి కెమెరాల ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డిఆర్‌వో విజయ్‌కుమార్, డిపివో వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.