పేదల ఆరోగ్యానికి సీఎం సహాయనిధి భరోసా
నెల్లూరు సిటీలో 50 మందికి రూ.31.34 లక్షల ఆర్థిక సాయం అందజేసిన మంత్రి నారాయణ ఇప్పటివరకు 579 మందికి రూ.5.19 కోట్లకు పైగా సాయం
నెల్లూరు, కార్పొరేషన్, మేజర్ న్యూస్ : ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) ఆర్థిక భరోసాగా నిలుస్తోందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పేర్కొన్నారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేదలకు సీఎం సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని లబ్ధిదారులకు శుక్రవారం చింతారెడ్డిపాలెంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా 50 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.31,34,707 విలువైన చెక్కులను అందజేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఈ సాయం ఊరటనిస్తుందని మంత్రి పేర్కొన్నారు. అర్హులైన వారికి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల చేతికే చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు.
నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఇప్పటివరకు 579 మందికి రూ.5,19,34,509 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని, సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందిస్తున్నారని తెలిపారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదలకు అడిగిన వెంటనే ఆర్థిక సాయం మంజూరు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మంత్రి నారాయణ కృతజ్ఞతలు తెలిపారు. వైద్య ఖర్చుల భారం కారణంగా ఏ పేద కుటుంబమూ ఇబ్బందులు పడకూడదన్న ఉద్దేశంతో సీఎం సహాయనిధి ద్వారా బాధితులకు అండగా నిలుస్తున్నట్లు పేర్కొన్నారు.