పరిషత్ పోరు ప్రశాంతం.... *చెదురుమదురు ఘటనలు మినహా సజావుగా పోలింగ్ *
విజయనగరం బ్యూరో, సూర్య : విజయనగరం జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం నిర్వహించిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో చెదురుమదురు ఘటనలు మినహా ఎక్కడా పెద్దగా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. ఉదయం నుంచి ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగిసే సమయానికి జిల్లాలో సుమారు 71శాతం ఓటింగ్ నమోదైనట్టు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు, తోపులాటలు చోటుచేసుకున్నప్పటికీ పోలీసులు వెంటనే స్పందించి పరిస్థితిని అదుపులోకి తీసుకురావడంతో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగింది.
జిల్లాలో మొత్తం 27 జెడ్పీటీసీ, 437 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందుకోసం 1,685 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తరలివచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రాజకీయ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో పోలింగ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు, ప్రముఖులు వారివారి పోలింగు బూత్ ల్లో ఓటుహక్కు వినియోగించుకున్నారు. అభ్యర్థులు, వారి అనుచరులు ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించగా, ఎన్నికల అధికారులు మాత్రం నిబంధనలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహణపై దృష్టి సారించారు.
చెదురుమదురు ఘటనలు
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ సందర్భంగా స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మెంటాడ మండలం జక్కువ, గజపతినగరం మండలం కెంగువ, గరివిడి, జొన్నవలస తదితర ప్రాంతాల్లో స్వల్ప ఘర్షణలు, తోపులాటలు జరిగినట్టు సమాచారం. ఆయా ప్రాంతాల్లో రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలు మినహా జిల్లావ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగినట్టు అధికారులు తెలిపారు.
క్యూలో ఉన్నవారికి ఓటు అవకాశం
సాయంత్రం 5 గంటలకు పోలింగ్ సమయం ముగిసినప్పటికీ, అప్పటికే పోలింగ్ కేంద్రాల గేటు లోపల క్యూలో ఉన్న ఓటర్లకు ఓటు వేసే అవకాశం కల్పించారు. చివరి ఓటరు ఓటు హక్కు వినియోగించుకునే వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగింది. పోలింగ్ సమయం ముగిసే వేళ కూడా కొన్ని కేంద్రాల్లో ఓటర్లు క్యూలో కనిపించారు. దీంతో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉందని భావించారు.
అధికారుల నిరంతర పర్యవేక్షణ
ఎన్నికల నిర్వహణను జిల్లా కలెక్టర్ రామసుందరరెడ్డి, ఎస్పీ ఏఆర్ దామోదర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. పోలింగ్ కేంద్రాల్లో పరిస్థితులను సమీక్షిస్తూ ఎన్నికల సిబ్బందికి అవసరమైన సూచనలు అందించారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించింది. పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు చేపట్టడంతో పాటు, ఎక్కడైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నారు.
ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
ఇటీవల మున్సిపల్ ఎన్నికల నిర్వహణతో పాటు పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కూడా పూర్తికావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. ఎన్నికల నిర్వహణలో భాగంగా భారీ సంఖ్యలో సిబ్బంది విధులు నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సామగ్రి పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టడం వంటి అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తంగా జిల్లాలో పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో ఎన్నికల నిర్వహణలో మరో కీలక ఘట్టం పూర్తయినట్టయింది.