పార్లపల్లిలో వైభవంగా అమ్మగారమ్మ తల్లికి సామూహిక పొంగళ్ళు..
పొదలకూరు మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం పార్లపల్లి గ్రామ దేవత, ఆదిపరాశక్తి శ్రీ అమ్మగారమ్మ తల్లికి ఆదివారం గ్రామస్తులు సామూహిక పొంగళ్ళు కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పొంగళ్ళ సామగ్రిని నెత్తిన పెట్టుకొని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పొంగళ్ళు పొంగించి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మగారమ్మ తల్లి ప్రత్యేక పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దేవీ శరన్నవరాత్రుల ప్రారంభ రోజునే సామూహిక పొంగళ్ళ కార్యక్రమం నిర్వహించడంతో గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. గ్రామస్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.