పారిశుధ్య కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరాలు
అనంతపురం బ్యూరో: పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అనంతపురం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాలు నిర్వహించారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని ఆరు సర్కిళ్ల పరిధిలో ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లలో ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు.
మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా. రాజా రవీంద్రనాథ్ చౌదరి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య పరిరక్షణపై పలు సూచనలు, సలహాలు అందించారు.
నగర పరిశుభ్రతలో కీలకపాత్ర పోషిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, సంక్షేమానికి నగరపాలక సంస్థ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని డా. రాజా రవీంద్రనాథ్ చౌదరి తెలిపారు. కార్యక్రమంలో ఆరు సర్కిళ్ల శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటేషన్ సెక్రటరీలు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.