పాలిచర్లపాడులో ప్రజా సమస్యలను పరిశీలించిన బొబ్బేపల్లి
వెంకటాచలం మేజర్ న్యూస్ : మండలంలోని పాలిచర్లపాడు అరుంధతివాడలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. ఇటీవల మీడియాలో వచ్చిన కథనాల ద్వారా సమస్యలను తెలుసుకున్న ఆయన శనివారం గ్రామాన్ని సందర్శించి స్థానికులతో మాట్లాడారు.అరుంధతివాడలో సుమారు 50 కుటుంబాలకు తాగునీరు అందించే మోటార్ గత ఏడు నెలలుగా పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వీధిలైట్లు వెలగకపోవడం, బస్సు సకాలంలో రాకపోవడంతో పాఠశాలలకు వెళ్లే పిల్లలు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సమస్యలపై సచివాలయ కార్యదర్శికి ఫోన్ చేసి వివరించగా, రెండు మూడు రోజుల్లో మోటార్‌ను మరమ్మతు చేయిస్తామని హామీ ఇచ్చినట్లు బొబ్బేపల్లి తెలిపారు. అవసరమైతే జనసేన పార్టీ తరఫున మోటార్ మరమ్మతు చేయించి తాగునీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు. వీధిలైట్ల సమస్యను పరిష్కరించడంతో పాటు బస్సు సకాలంలో వచ్చేలా సంబంధిత అధికారులతో మాట్లాడుతామని చెప్పారు.ప్రజలకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున స్పందించి పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామని బొబ్బేపల్లి సురేష్ నాయుడు తెలిపారు. కార్యక్రమంలో సందూరి శ్రీహరి, శివరాత్రి సందీప్, గ్రామస్తులు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.