నూతన శోభతో నెల్లిమర్ల సీహెచ్‌సీ..
* మెరుగైన వైద్యంతో రోగులకు భరోసా!
* సూపరిండెంటెంట్ గీతా భవాని
నెల్లిమర్ల, సెప్టెంబర్ 28; నెల్లిమర్ల సామాజిక ఆరోగ్య కేంద్రం (సీహెచ్‌సీ) నూతన భవనంలోకి మారిన తర్వాత సరికొత్త రూపు సంతరించుకుంది. అత్యాధునిక వసతులు, మెరుగైన వైద్య సేవలతో ఈ ఆసుపత్రి స్థానిక ప్రజలకు ఆరోగ్య భరోసా ల్పిస్తోంది.
ఓపీ సంఖ్యలో పెరుగుదల పాత ఆసుపత్రి భవనంలో రోజువారీ ఔట్ పేషెంట్ (ఓపీ) సంఖ్య 100 నుంచి 150 మధ్య ఉండగా.. నూతన భవనం అందుబాటులోకి రావడం ద్వారా ఆ సంఖ్య 200 నుంచి 250 వరకు పెరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గీతా భవానీ వెల్లడించారు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య విభాగాలు రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు సీహెచ్‌సీలో ప్రత్యేక విభాగాలు విస్తరించబడ్డాయి.
ప్రస్తుతం ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సేవలు: జనరల్ మెడిసిన్ సర్జరీ ప్రసూతి (గైనిక్) చిన్నపిల్లల విభాగం దంత వైద్యం ఫిజియోథెరపీ అధునాతన ల్యాబ్ మరియు ఎక్స్-రే ప్లాంట్ రోగుల సమస్యలపై సూపరింటెండెంట్ స్పందన
ఆసుపత్రి సేవలకు సంబంధించి వస్తున్న విమర్శలు, సమస్యలపై డాక్టర్ గీతా భవానీ స్పష్టతనిచ్చారు.
ప్రసవాలు - అత్యవసర కేసులు:
రెగ్యులర్ గైనిక్ వైద్యులు సెలవులో ఉన్న సమయంలో, ప్రత్యామ్నాయంగా మరో వైద్యురాలిని నియమించి ప్రసవాలు జరిపిస్తున్నారు. కేవలం అత్యవసర (ఎమర్జెన్సీ) కేసులను మాత్రమే గైనిక్ ఘోష ఆసుపత్రికి, తీవ్రమైన కేసులను జిల్లా కేంద్ర ఆసుపత్రికి అంబులెన్స్ ద్వారా తరలిస్తున్నామని.. ఎట్టి పరిస్థితుల్లోనూ రోగులను ప్రైవేట్ ఆసుపత్రులకు పంపడం లేదని ఆమె స్పష్టం చేశారు.
సర్జరీల సేవలు: సర్జరీ నిపుణులైన వైద్యులు ఉన్నత చదువులకు వెళ్లడంతో తాత్కాలికంగా శస్త్రచికిత్సలు తగ్గాయి. ఈ విషయాన్ని ఇప్పటికే డీసీహెచ్‌ఎస్ దృష్టికి తీసుకెళ్లగా, మరో వారంలోగా డిప్యూటేషన్‌పై కొత్త సర్జరీ వైద్యులు రానున్నారని తెలిపారు.
ఫిజియోథెరపీ విభాగం:
ఫిజియోథెరపీ వైద్యులు సమయపాలన పాటించడం లేదనే విమర్శలపై స్పందిస్తూ.. ఇప్పటివరకు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదులు రాలేదని, అయినప్పటికీ నిబంధనల ప్రకారం వైద్యులు, సిబ్బంది కచ్చితంగా సమయపాలన పాటించాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
స్థానికుల అభిప్రాయం - మరింత మెరుగుపడాల్సిన అంశాలు
నూతన సీహెచ్‌సీ భవనం, ల్యాబ్, ఎక్స్-రే వంటి ఆధునిక వసతులు సమకూరినప్పటికీ.. దానికి తగినట్లుగా ఓపీ, ఐపీ (ఇన్‌పేషెంట్) సంఖ్యలో ఆశించిన స్థాయిలో వృద్ధి కనిపించడం లేదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
ప్రజల్లో పూర్తిస్థాయిలో నమ్మకం కలిగించేందుకు మరిన్ని ప్రచార కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు, అన్ని విభాగాల డాక్టర్లు నిత్యం అందుబాటులో ఉండేలా అధికారులు తగిన చర్యలు తీసుకుంటే ఈ ఆసుపత్రి మరిన్ని అద్భుతమైన సేవలను అందించగలదని స్థానికులు కోరుతున్నారు.