నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయాలి.
పాలకొల్లు, మేజర్ న్యూస్ సమయంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కామ్రేడ్ బి.బలరాం డిమాండ్ చేశారు. పాలకొల్లులోని పార్టీ కార్యాలయంలో జిల్లా, మండల నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ, బియ్యం, పంచదార, చింతపండు, పప్పులు, నూనె, పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయని, సామాన్య ప్రజలకు ఇవి అందుబాటులో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచుతున్నా ప్రభుత్వాలు నియంత్రించలేకపోవడం విచారకరమన్నారు. గ్రామీణ మాల్స్ ద్వారా 45 రకాల నిత్యావసర వస్తువులు అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదని విమర్శించారు. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యంతోపాటు పంచదార, నూనె, పప్పులు, ఇతర నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని, బ్లాక్ మార్కెట్ను అరికట్టి ప్రజలపై ధరల భారాన్ని తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జె.ఎన్.వి. గోపాలన్, జిల్లా కమిటీ సభ్యుడు ఏ.రవి, మండల కన్వీనర్ బాతిరెడ్డి జార్జి పాల్గొన్నారు.