నెల్లిమర్ల వైసిపిలో కొత్త జోష్
నెల్లిమర్ల, సూర్య : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కొంతమంది నాయకులు వీడి వేరే పార్టీలలో చేరినప్పటికీ, పార్టీ కేడర్ మాత్రం ఏమాత్రం చెక్కుచెదరకుండా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంటే నిలవడం అభినందనీయమని వైసిపి జిల్లా ఉపాధ్యక్షులు పతివాడ సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయాల్లో నాయకులు పార్టీలు మారడం సహజమే అయినప్పటికీ, పదవులు లేదా స్వార్థం కోసం పార్టీ మారాక... తమకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీని, అధినేత వైఎస్ జగన్‌పై నిందలు వేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. "వైసిపి ఒక మహాసముద్రం లాంటిది.. పాత నీరు బయటకుపోతుంటే కొత్త నీరు వచ్చి చేరుతూనే ఉంటుంది, కానీ ఏనాడు దాని ఉనికిని కోల్పోదు" అని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్టానం ఎంతో నమ్మకంతో సామాన్య కుటుంబం నుంచి వచ్చిన గదల సన్యాసినాయుడు (సన్నీ)కి నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించిందని నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి, రాబోయే స్థానిక ఎన్నికల్లో నెల్లిమర్ల నియోజకవర్గంలో వైసిపి విజయఢంకా మోగించాలని, ఆ విజయాన్ని అధినేత వైఎస్ జగన్‌కు కానుకగా ఇవ్వాలని పిలుపునిచ్చారు.
శాసనమండలి ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్సీ పెనుమత్స సురేష్ బాబుల ఆశీస్సులతో నియోజకవర్గంలో పార్టీని మరింత ముందుకు నడపాలని ఆయన కోరారు. నాలుగు మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రిపోర్టర్ : రాజారావు, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా.