స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం - జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు, మేజర్ న్యూస్ : జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా గురువారం అమరావతి సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, ఎస్పీ డాక్టర్ అజిత వేజెండ్ల, సంబంధిత అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలు, పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి దశలవారీగా చేపట్టాల్సిన చర్యలు, ఎన్నికల నిర్వహణకు అవసరమైన బ్యాలెట్ బాక్సులు, ఇతర ఎన్నికల సామగ్రి సిద్ధం చేసుకోవడం తదితర అంశాలపై సూచనలు చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల మాట్లాడుతూ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో రిజర్వేషన్ల ప్రక్రియ తుది దశకు చేరుకుందని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి అవసరమైన శిక్షణను త్వరలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా అవసరమైన కార్యాచరణను చేపట్టనున్నట్లు కలెక్టర్ తెలిపారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సామగ్రి పంపిణీ, రిసెప్షన్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల విధులకు సిబ్బంది నియామకం, సిబ్బందికి శిక్షణ, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలీసు బందోబస్తు తదితర అంశాలపై కార్యాచరణ చేపట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నుంచి అవసరమైన ఆదేశాలు అందిన వెంటనే జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, నెల్లూరు మున్సిపల్ కమిషనర్ నందన్, జిల్లా పరిషత్ డిప్యూటీ ఈవో బ్రహ్మయ్య, జిల్లా పంచాయతీ అధికారి వెంకట్రామన్ తదితరులు పాల్గొన్నారు.