లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు!
లో వోల్టేజీతో ఎండుతున్న పంటలు!
వ్యవసాయ విద్యుత్ రోజుకు ఆరు గంటలే.. అదీ నిరంతరం సరఫరా కావడం లేదు
సమస్య పరిష్కరించకుంటే సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు
ఎమ్మెల్యే చింత ప్రభాకర్ హెచ్చరిక
కొండాపూర్ ; కొండాపూర్ మండలంలో లో వోల్టేజీ, విద్యుత్ సరఫరాలో అంతరాయాలతో పంటలు ఎండిపోతున్నాయని, వెంటనే సమస్యను పరిష్కరించి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందించాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు విద్యుత్ శాఖ డీఈ నెహ్రూ నాయక్ ను కలిసి మండలంలోని రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయానికి రోజుకు ఆరు గంటలు మాత్రమే విద్యుత్ సరఫరా చేస్తున్నారని, నిరంతరాయంగా అందకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనికి తోడు లో వోల్టేజీ సమస్య కారణంగా మోటార్లు సక్రమంగా పనిచేయక పంటలకు నీరందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.శివన్నగూడెంలో సుమారు 20 ఎకరాల్లో సాగు చేసిన కారెట్ పంట ఎండిపోతోందని, గంగారం, మహ్మదాపూర్, తెర్పోల్, గొల్లపల్లి, మన్ సన్ పల్లి, మునిదేవునిపల్లి, హరిదాసుపూర్ గుంత పల్లి గ్రామాల్లో కూరగాయల పంటలు ఎండుముఖం పట్టాయని పేర్కొన్నారు. తోగర్‌పల్లి, కొండాపూర్, చర్ల గోపులారం, తెర్పోల్, మల్లేపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో వరి పంట తుది దశకు చేరుకుందని తెలిపారు.రైతులు లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేశారని, చేతికొచ్చే సమయంలో విద్యుత్ సమస్యలతో నష్టపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించి, లో వోల్టేజీని నివారించి వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.రైతుల పంటలు ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోం. ఒక్క ఎకరం పంట ఎండిపోయినా రైతులతో కలిసి సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తాం. రైతులకు నష్టం జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలి. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలి అని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ స్పష్టం చేశారు.