పోలేరమ్మ సన్నిధిలో కాకాణి ప్రత్యేక పూజలు
పూర్ణకుంభంతో ఘన స్వాగతం.. జాతర వైభవంపై అభినందనలు
పొదలకూరు, మేజర్ న్యూస్ : దశాబ్దాల తర్వాత వైభవంగా జరుగుతున్న పొదలకూరు పోలేరమ్మ జాతరలో భక్తుల సందడి కొనసాగుతోంది. జాతర మూడో రోజైన గురువారం మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ఆలయ పూజారులు, నిర్వాహకులు, జాతర కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.ఈ సందర్భంగా జాతరలో కొనసాగుతున్న భక్తుల సందడి, ఆలయ పరిసరాల్లో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాకాణి పరిశీలించారు. సుమారు 90 ఏళ్ల తర్వాత జరుగుతున్న పోలేరమ్మ జాతరను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.పోలేరమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆకాంక్షించారు. కాకాణి అమ్మవారిని దర్శించుకున్న సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తులు సందడి చేశారు.