నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. ప్రధాని మోదీతో భేటీ కానున్న ఏపీ ముఖ్యమంత్రి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మధ్యాహ్నం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ హస్తిన పర్యటనలో భాగంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక ప్రాజెక్టులు, అభివృద్ధి అంశాలపై ప్రధానితో ముఖ్యమంత్రి సమగ్రంగా చర్చించే అవకాశముంది.
అలాగే రేపు (గురువారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయడం, భూసేకరణ మరియు నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ (R&R) కోసం కేంద్రం నుండి రూ. 33,000 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఈ సందర్భంగా జలశక్తి మంత్రిని కోరనున్నారు. రాష్ట్ర అభివృద్ధి, రాజధాని అమరావతి మరియు పోలవరం ప్రాజెక్టు నిధుల సమీకరణే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపడుతున్న ఈ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది.