నర్సీపట్నంలో నూతన శకం.. చారిత్రాత్మక మెజారిటీతో మున్సిపల్ పీఠం కైవసం.
- కుల రాజకీయాలను తిప్పికొట్టి కూటమికి పట్టంగట్టిన ప్రజలు
- అభివృద్ధిపైనే మా దృష్టి.. వైఎస్సార్సీపీ దుకాణం బంద్ : రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్
నర్సీపట్నం నవంబర్ 4 మేజర్ న్యూస్ :
నర్సీపట్నం మున్సిపల్ చైర్ పర్సన్‌గా పద్మావతి బాధ్యతలు చేపట్టడం అత్యంత సంతోషకరమని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతో నర్సీపట్నంలో నూతన శకం ప్రారంభమైందని ఆయన ప్రకటించారు.
వన్ సైడ్ అయిన ఎన్నికలు.. చారిత్రాత్మక విజయం
మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి ఏకంగా 23,114 ఓట్లు పోలయ్యాయని, ప్రజల తీర్పు పూర్తిగా వన్ సైడ్ అయిందని విజయ్ స్పష్టం చేశారు. మొత్తం 40 వార్డులకు గాను 39 వార్డుల్లో (ఇండిపెండెంట్లు, మద్దతుదారులతో కలిపి) కూటమి పక్షాలు ఘనవిజయం సాధించాయన్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 30 వేల మెజారిటీ రాగా, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సులు సైకిల్ ఓట్లతో కిక్కిరిసిపోయాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నర్సీపట్నం చరిత్రలో ఒకే పార్టీ ఇన్ని వార్డులు గెలుచుకోవడం ఇదే తొలిసారని, అతి తక్కువగా 32 ఓట్ల మెజారిటీతో ఒక వార్డు గెలిచామని తెలిపారు. బీ-ఫామ్ ఆలస్యమైనా ఉంగరం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థి కూడా భారీ మెజారిటీతో గెలుపొందడం విశేషమన్నారు.
కుల రాజకీయాలకు ప్రజల చెక్
పద్మావతికి కొన్ని కులాల ఓట్లు పడవని ప్రతిపక్షాలు కుల రాజకీయాలు చేశాయని, కానీ ప్రజలు కులమతాలకు, వార్డుల సరిహద్దులకు అతీతంగా ఓట్లు వేశారని విజయ్ హర్షం వ్యక్తం చేశారు. అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా ప్రజల కోసమే పనిచేస్తామని, అందుకే తన ప్రచారంలో ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని స్పష్టం చేశారు.
వైఎస్సార్సీపీ దుకాణం బంద్
వైఎస్సార్సీపీ నాయకత్వం పూర్తిగా విఫలమైందని, ఆ పార్టీ దుకాణం మూతపడిందని విజయ్ విమర్శించారు. తమ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైతే పట్టించుకోని వైఎస్సార్సీపీ నేతలు.. ఇళ్లకు తాళాలు వేసుకుని దాక్కున్నారని ఎద్దేవా చేశారు. బలిఘట్టంలో ఒక రైతును ఓడించేందుకు డమ్మీ అభ్యర్థిని పెట్టారని, పార్వతీ పరమేశ్వరుల విగ్రహ ఊరేగింపును లారీలతో అడ్డుకున్నా.. ఆ వార్డుల్లో కూడా ప్రజలు వైఎస్సార్సీపీకి పరాభవం మిగిల్చారని దుయ్యబట్టారు.
రూ. 267 కోట్లతో అభివృద్ధి పనులు
నర్సీపట్నంలో మౌలిక సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని విజయ్ తెలిపారు. గత రెండున్నరేళ్లలో మంచినీటి ప్రాజెక్టులు, ఇతర అభివృద్ధి పనుల కోసం సుమారు రూ.267.75 కోట్లు తీసుకొచ్చామన్నారు. యువత తలసరి ఆదాయం, మున్సిపాలిటీ ఆదాయ వనరులు పెంచేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. పద్మావతి చైర్ పర్సన్‌గా పూర్తి స్థాయి విజన్‌ను త్వరలో ప్రకటిస్తారని, నాయకులకు-ప్రజలకు మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఉండే వ్యవస్థను తెస్తామన్నారు.
మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు
తుఫానుల వంటి విపత్కర పరిస్థితుల్లో, బొడ్డపల్లి లాంటి ఘటనల్లో ప్రాణాలకు తెగించి వాస్తవాలను ప్రజలకు చేరవేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు విజయ్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.