నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ బరిలో మేళ్లచెరువు రంగ రాజీవ్ గుప్తా
నరసరావుపేట మున్సిపల్ చైర్మన్ పదవికి తెలుగుదేశం పార్టీ తరఫున తాను దరఖాస్తు చేసుకున్నట్లు యువ న్యాయవాది మేళ్లచెరువు రంగ రాజీవ్ గుప్తా తెలిపారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ అరవింద బాబు తన పేరును ప్రస్తావించిన నేపథ్యంలో, తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. తన కుటుంబ నేపథ్యాన్ని వివరిస్తూ పట్టణంలో ప్రముఖులైన మేళ్లచెరువు వీరాంజనేయులు, కపిలవాయి కాశీరామారావుల మనవడైన తాను, సైనిక్ స్కూల్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసి, కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ చేశానని చెప్పారు. అనంతరం ఎల్.ఎల్.బి అభ్యసించి ఏపీ హైకోర్టులో కొంతకాలం ప్రాక్టీస్ చేశానని, ప్రస్తుతం నరసరావుపేటలో న్యాయవాదిగా సేవలు అందిస్తున్నట్లు వివరించారు. సమాజ సేవలో భాగంగా మిత్రులతో కలిసి 12 ఏళ్ల క్రితం 'లిటిల్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్' స్థాపించి 300కు పైగా సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. కేరళ, బుడమేరు వరదలతో పాటు కోవిడ్ విపత్తుల సమయంలో చేసిన సేవలకు గాను కృష్ణా, పల్నాడు జిల్లాల కలెక్టర్ల నుంచి పురస్కారాలు సైతం అందుకున్నట్లు పేర్కొన్నారు. 2016 నుంచి టీడీపీలో సభ్యుడిగా ఉన్న తాను, 2019, 2024 ఎన్నికల్లో పార్టీ విజయానికి విశేషంగా కృషి చేశానని తెలిపారు. చట్టసభలు, నామినేటెడ్ పదవుల్లో 40 ఏళ్ల లోపు యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ ఏడాది జనవరిలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కోరినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం టీడీపీ కూడా యువతను ప్రోత్సహిస్తున్నందున ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అరవింద బాబు, పరిశీలకులకు తన బయోడేటాను సమర్పించానని వెల్లడించారు. మున్సిపల్ చైర్మన్ రేసులో ఉన్న ఇతర ఆశావహులు కూడా తన కుటుంబానికి ఆప్తులేనని, పార్టీ అధిష్టానం ఎవరికి బీఫారం ఇచ్చినా వారి గెలుపు కోసం తాను ముందుండి పని చేస్తానని స్పష్టం చేశారు. కేవలం 40 ఏళ్ల లోపు యువత కోటా ఉంటేనే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఈ సందర్భంగా ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు.
మల్లికార్జునరావు పల్నాడు జిల్లా ఇన్చార్జి…