BREAKING
కొబ్బరి మొక్కలకు ద్రవ జీవామృతం పారిశుధ్య కార్మికులకు దసరా బోనస్ పంపిణీ సిపిఐ (ఎం) కౌన్సిలర్ కిన్నెర కృష్ణ కుమారుడు రాఘవ కన్నుమూత ఢిల్లీలో కాక్రోచ్ మూవ్‌మెంట్ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను అదుపులోకి తీసుకున్న పోలీసులు రుచులకు కొత్త చిరునామా.. * ఎఫ్‌ 4 ఫ్యామిలీ రెస్టారెంట్‌! వర్షాల కోసం కప్పతల్లి ఊరేగింపు స్విట్జర్లాండ్‌లో బ్యాంకింగ్ కుంభకోణాన్ని వెలికితీసిన సీనియర్ జర్నలిస్ట్‌పై క్రిమినల్ అభియోగాలు అక్రమ ఇసుక రవాణాచేస్తే కఠిన చర్యలు తప్పవు - ఎస్సై రమేష్ భక్తులకు టిక్కెట్లు -కళాకారులకు ఇక్కట్లు. అక్షిత విద్యార్థిని నీట్ కోచింగ్ కు సర్పంచ్ ఇమ్మడి మహేష్ ఆర్థిక చేయూత రాబోయే శీతాకాలం వేళ ఉక్రెయిన్‌కు ఉపశమనం వేపకాయల బతుకమ్మ శుభాకాంక్షలు ఓటుకు నోటును తిరస్కరిద్దాం.. విలువైన ఓటు కు విలువనిద్దాం... ...... విద్వాన్ జ్యోతి చంద్రమౌళి...... శ్రీ ధనలక్ష్మి దేవి అలంకారంలో అమ్మవారు హంగేరీ ఉక్రెయిన్ ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మలుపు

నామినేషన్ నుండి పోలింగ్ వరకు

Select Suryaa Now
నామినేషన్ నుండి పోలింగ్ వరకు

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం ;మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్, కౌన్సిలర్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ దాఖలు నుంచి పోలింగ్ వరకు ప్రతి దశలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యంగా నామినేషన్ పత్రాల సమర్పణ, పరిశీలన, ఉపసంహరణ, ఎన్నికల ప్రచారం, ఖర్చుల నిర్వహణ, పోలింగ్ రోజు అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలి. ఈ నేపథ్యంలో అభ్యర్థులు పాటించాల్సిన ముఖ్యమైన సూచనలు ఇవీ..

నామినేషన్ దాఖలు సమయంలో..

1. ఎన్నికల అధికారి నుంచి నిర్దేశిత నమూనాలో నామినేషన్ పత్రాలు తీసుకుని, సూచించిన విధంగా వివరాలు నమోదు చేయాలి.

2. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్నట్లయితే, ప్రతి పత్రంలోని వివరాలు, సంతకాలు, ప్రతిపాదకుడి వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. 2014 మున్సిపల్ ఎన్నికల్లో ఒక సంతకం పెట్టకుండా నామినేషన్ దాఖలు చేసిన కారణంగా అతన్ని పోటీ నుండి తొలగించారు. ఇటువంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకోవాలి. 

3. ఒకే వార్డుకు నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థి ఎన్ని పత్రాలు సమర్పించవచ్చో తాజా ఎన్నికల నిబంధనలను నిర్ధారించుకోవాలి. ఎన్నికల అధికారిని అడిగి తెలుసుకోవాలి. 

4. అభ్యర్థి పేరు, ఓటరు జాబితా క్రమ సంఖ్య, వార్డు వివరాలు, ప్రతిపాదకుడి వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోవాలి.

5. కుల ధ్రువపత్రం, ప్రమాణపత్రాలు, భద్రతా డిపాజిట్ రసీదు తదితర అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి.

6. పార్టీ అభ్యర్థులు తమ పార్టీ అధికారిక అభ్యర్థిత్వానికి సంబంధించిన పత్రాలను గడువులోగా సమర్పించాలి.

7. నామినేషన్ పత్రాలను చివరి రోజు వరకు వాయిదా వేయకుండా ముందుగానే సమర్పించాలి.

8. నామినేషన్ సమర్పించిన తర్వాత స్వీకరణ రసీదు తీసుకుని భద్రపరచుకోవాలి.

నామినేషన్ల పరిశీలన సమయంలో..

9. నామినేషన్ల పరిశీలన జరిగే తేదీ, సమయాన్ని ముందుగానే తెలుసుకోవాలి.

10. తమ నామినేషన్‌పై అభ్యంతరాలు వచ్చినట్లయితే, వాటికి సంబంధించిన వివరాలను తెలుసుకుని నిబంధనల ప్రకారం సమాధానం ఇవ్వాలి.

11. నామినేషన్ అంగీకరించబడిందా, తిరస్కరించబడిందా అనే విషయాన్ని ఎన్నికల అధికారి వద్ద నిర్ధారించుకోవాలి.

నామినేషన్ల ఉపసంహరణ సమయంలో అత్యంత జాగ్రత్త..

13. ఒకటి కంటే ఎక్కువ నామినేషన్ పత్రాలు సమర్పించినంత మాత్రాన వాటిలో ఒక పత్రాన్ని ఉపసంహరించుకుంటే మిగిలిన పత్రాల ద్వారా పోటీలో కొనసాగవచ్చని భావించకూడదు. అభ్యర్థిత్వ ఉపసంహరణకు సంబంధించిన నిర్దేశిత పత్రంపై సంతకం చేసే ముందు దాని అర్థాన్ని పూర్తిగా తెలుసుకోవాలి. గతంలో రాయవరం మండలంలో ఒకరు సర్పంచ్ పదవికి పోటీ చేస్తూ ఒక సెట్ ను ఉపసంహరించుకోవడంతో మొత్తం పోటీ నుండే అతని తప్పుకోవాల్సి వచ్చింది. వేరొక అభ్యర్థిని ఏకగ్రీవంగా ప్రకటించాల్సి వచ్చింది. 

14. ఒక అభ్యర్థి రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేసినా, తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు నిర్దేశిత పత్రం సమర్పిస్తే, అది కేవలం ఒక నామినేషన్ పత్రాన్ని తొలగించడంగా కాకుండా మొత్తం అభ్యర్థిత్వ ఉపసంహరణగా పరిగణించే అవకాశం ఉంది. అందువల్ల పత్రంలోని విషయాలను చదవకుండా సంతకం చేయకూడదు.

15. ఒక నామినేషన్ పత్రాన్ని మాత్రమే ఉపసంహరించుకోవాలనే ఉద్దేశం ఉంటే, ముందుగా ఎన్నికల అధికారిని సంప్రదించి నిబంధనల ప్రకారం అలాంటి అవకాశం ఉందో లేదో నిర్ధారించుకోవాలి. అభ్యర్థిత్వ ఉపసంహరణ పత్రాన్ని దానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించకూడదు.

16. ఉపసంహరణ పత్రంపై సంతకం చేసే ముందు అది ఏ అభ్యర్థిత్వానికి సంబంధించినదో, ఏ ఎన్నికకు సంబంధించినదో పూర్తిగా పరిశీలించాలి.

17. ఉపసంహరణకు నిర్ణయించిన చివరి తేదీ, సమయాన్ని కచ్చితంగా తెలుసుకోవాలి. ఆలస్యంగా సమర్పించిన పత్రం ఆమోదం పొందకపోవచ్చు.

18. అభ్యర్థి స్వయంగా ఉపసంహరణ పత్రాన్ని సమర్పించడం మంచిది. ఇతరుల ద్వారా సమర్పించే పరిస్థితిలో నిబంధనల ప్రకారం అనుమతి, అధికారం ఉన్నాయో నిర్ధారించుకోవాలి.

19. ఉపసంహరణ పత్రం సమర్పించిన తర్వాత ఎన్నికల అధికారి నుంచి స్వీకరణ ధ్రువీకరణ తీసుకోవాలి. ఉపసంహరణ అధికారికంగా నమోదైందో లేదో నిర్ధారించుకోవాలి.

20. ఉపసంహరణను ఒకసారి అధికారికంగా సమర్పించిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకోవడానికి సాధారణంగా అనుమతి ఉండదు. అందువల్ల పార్టీ నాయకుల ఒత్తిడి, ఇతరుల మాటలు లేదా తొందరపాటు నిర్ణయాల ఆధారంగా సంతకం చేయకూడదు.

21. ఉపసంహరణ అనంతరం తుది పోటీ అభ్యర్థుల జాబితాలో తమ పేరు ఉందో లేదో పరిశీలించాలి.

ఎన్నికల ప్రచారం సమయంలో..

22. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలి.

23. ఓటర్లకు డబ్బు, బహుమతులు, మద్యం లేదా ఇతర ప్రలోభాలు అందించకూడదు.

24. ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం, కులం లేదా మతం పేరుతో ఓట్లు అడగడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.

25. సభలు, ఊరేగింపులు, ప్రచార వాహనాలు, మైకుల వినియోగానికి అవసరమైన అనుమతులు తీసుకోవాలి.

26. ఎన్నికల ప్రచారానికి చేసే ఖర్చుల వివరాలను రోజువారీగా నమోదు చేసి, నిర్ణీత పరిమితులు, గడువులను పాటించాలి.

27. ఓటర్లను భయపెట్టడం, బెదిరించడం లేదా స్వేచ్ఛగా ఓటు వేయకుండా అడ్డుకోవడం వంటి చర్యలకు పాల్పడకూడదు.

పోలింగ్ రోజున పాటించాల్సినవి..

28. పోలింగ్ ఏ తేదీన, ఏ సమయంలో జరుగుతుందో ముందుగానే తెలుసుకోవాలి.

29. పోలింగ్ కేంద్రాల వద్ద ఎన్నికల సంఘం విధించిన నియమాలను పాటించాలి.

30. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడం, ప్రచారం నిర్వహించడం వంటి అంశాల్లో వర్తించే నిబంధనలను ఉల్లంఘించకూడదు.

31. పోలింగ్ కేంద్రం పరిసరాల్లో అనుమతిలేని ప్రచారం, గుంపులుగా చేరడం వంటి చర్యలకు దూరంగా ఉండాలి.

32. ఎన్నికల అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే, ఆధారాలతో సంబంధిత ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలి.

33. పోలింగ్ ముగిసే వరకు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటిస్తూ, శాంతియుత వాతావరణానికి సహకరించాలి.

అభ్యర్థులకు ముఖ్య సూచన: నామినేషన్ దాఖలు నుంచి ఉపసంహరణ వరకు ప్రతి పత్రాన్ని చదివి, దాని ఉద్దేశాన్ని తెలుసుకుని మాత్రమే సంతకం చేయాలి. ముఖ్యంగా ఉపసంహరణ విషయంలో తొందరపాటు నిర్ణయం తీసుకుంటే పోటీలో కొనసాగే అవకాశాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఏ సందేహం వచ్చినా ఎన్నికల అధికారిని సంప్రదించి స్పష్టత తీసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి.