ముస్లిం మైనార్టీ సోదరుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక చొరవ
ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రత్యేక చొరవ
*ఆళ్లగడ్డ పట్టణ అభివృద్ధికి రూ.21 కోట్ల నిధులు.. సమస్యల పరిష్కారానికి హామీ....
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
ఆళ్లగడ్డ పట్టణంలో ముస్లిం మైనారిటీ సోదరుల సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. గతంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మసీదు సమీపంలో ఉన్న ఈద్గా, ఖబరస్తాన్‌ను సందర్శించిన సమయంలో సమాధుల వద్ద మట్టి కుంగిపోవడంతో మృతుల కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రావడం జరిగింది.
ఈ సమస్యను పరిష్కరిస్తానని గతంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ముస్లిం సోదరులకు హామీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఆమె తన సొంత నిధులతో మట్టి తోలించి అవసరమైన పనులు పూర్తి చేయించారు. ఇచ్చిన మాట ప్రకారం పనులు పూర్తి కావడంతో ముస్లిం సోదరులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మసీదు కాంపౌండ్ వాల్ నిర్మాణం, అంతర్గత రహదారి ఏర్పాటు వంటి సమస్యలను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆళ్లగడ్డ పట్టణంలోని ఇమామ్‌లకు అనుకూలమైన స్థలంలో నివాస కాలనీ ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తిపై ఇప్పటికే సంబంధిత అధికారులతో చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉంటే ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఆళ్లగడ్డ పట్టణం, మండల పరిధిలోని మసీదులకు అవసరమైన కాంపౌండ్ వాల్స్ నిర్మాణం కోసం సుమారు రూ.2 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించి సమాచారం అందిందని, దీనిపై మరోసారి అధికారులతో మాట్లాడి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు.ఆళ్లగడ్డ పట్టణ అభివృద్ధికి రూ.21 కోట్ల నిధులు మంజూరయ్యాయని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తెలిపారు. ఈ నిధులతో పట్టణంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ సహకారంతో ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని, జిల్లా స్థాయిలోనే అభివృద్ధిలో ఆళ్లగడ్డ ను అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ హుస్సేన్ భాష, సలాం, తాలూకా ప్రైవేట్ పాఠశాల సంఘం నాయకుల అమీర్ భాష, మసీద్ ఇమాములు,తదితర ముస్లిం సోదరులు పాల్గొన్నారు.