మున్సిపల్ ఎన్నికల కు పటిష్ట పోలీసు బందోబస్తు....
విజయనగరం, సూర్య : జిల్లాలో నవంబరు 1న జరగనున్న విజయనగరం మున్సిపల్ కార్పొరేషను, బొబ్బిలి మున్సిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకొనే విధంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు.
జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మాట్లాడతూ
విజయనగరం మున్సిపల్ కార్పొరేషను, బొబ్బిలి మున్సిపాల్టీ, నెల్లిమర్ల నగర పంచాయతీ ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసుశాఖ అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందన్నారు.
సుమారు 1500మంది పోలీసు అధికారులు, సిబ్బందిని మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు, భద్రత విధులకు వినియోగిస్తున్నామన్నారు. ఎన్నికల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టేందుకు విజయగరం, బొబ్బిలి, నెల్లిమర్లకు ఒక్కొక్క డిఎస్పీని బాధ్యులుగాను, వారిని పర్యవేక్షించేందుకు అదనపు ఎస్పీ స్థాయి అధికారులను నియమించామన్నారు. డిస్ట్రిబ్యూషను సెంటరు నుండి పోలింగు మెటీరియల్ తీసుకొని వెళ్ళే పోలింగు సిబ్బందితోపాటు, పోలింగు స్టేషనుల వద్ద భద్రత, బందోబస్తు విధులు నిర్వహించే పోలీసు సిబ్బంది కూడా ఎస్కార్టుగా వెళ్ళే విధంగా చర్యలు చేపట్టామన్నారు.
పోలింగు ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్సులను సురక్షితంగా స్ట్రాంగ్ రూంలకు తరలించే విధంగా బందోబస్తు నిర్వహించే సిబ్బందితోపాటు రూట్ మొబైల్స్ ను ఏర్పాటు చేసామన్నారు. రూట్ మొబైల్ విధులు నిర్వహించే సిబ్బంది, అధికారులు వారికి కేటాయించిన రూట్లో గల పోలింగు కేంద్రాలు వద్ద ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపడతారన్నారు. వీరిని పర్యవేక్షించేందుకు, అవసరమైతే అదనపు బలగాలతో సంఘటనా స్థలంకు చేరుకొనే విధంగా స్ట్రైకింగు ఫోర్సులను, స్పెషల్ స్ట్రైకింగు ఫోర్సులను నియమించా మని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. పోలింగు కేంద్రాల గత చరిత్ర, నమోదైన కేసులు, ప్రస్తుత పరిస్థితులను పరిగణలోకి తీసుకొని హైపర్ సెన్సిటివ్, సెన్సిటివ్, నార్మల్ గా విభజించి, అందుకు అనుగుణంగా పోలీసు సిబ్బందిని కేటాయించామన్నారు. పోలింగు కేంద్రాల రూట్ మొబైల్స్, స్ట్రైకింగు, స్పెషల్ స్ట్రైకింగు ఫోర్సులను అప్రమత్తం చేసేందుకు కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసామన్నారు. పోలింగు కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో ఎవ్వరూ ఉండకూడదని, ప్రజలకు సందేశాలను ఇచ్చేందుకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ను కూడా ఏర్పాటు చేసామన్నారు. ఎన్నికల అనంతరం క్షేత్ర స్థాయిలో గొడవలను నియంత్రించేందుకు ముందుగా గుర్తించిన ప్రదేశాల్లో పోలీసు పికెట్లను ఏర్పాటు చేసామన్నారు. బ్యాలెట్ బాక్సులను భద్రపర్చే స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసామని, ప్రత్యేకంగా పోలీసు గార్డును కూడా ఏర్పాటు చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు 4గురు డిఎస్పీలను, 8మంది సిఐలను, 47 మంది ఎస్ఐలను, 84మంది ఎఎస్ఐ/హెచ్సిలను, 302మంది కానిస్టేబుళ్ళు, 140మంది హెూంగార్డులతోపాటు ఆర్మ్డ్ రిజర్వు, ఇతర విభాగాల్లో డిప్యూటేషనుపై పని చేస్తున్న పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నామని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలందరూ సహకరించాలని, ప్రలోభాలకు లొంగ వద్దని, ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని ప్రజలను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ కోరారు.