మున్సిపాలిటీలో మౌలిక వసతులకు ప్రత్యేక ప్రాధాన్యత
ఆమదాలవలస, సెప్టెంబర్ 28, మేజర్ న్యూస్
మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుకు సీసీ రహదారుల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ తమ్మినేని గీత తెలిపారు. ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధి 13వ వార్డులో విద్యానగర్ వివిధ ప్రాంతాల్లో రూ. 10 లక్షలతో నిర్మించినున్న సిసి రహదారుల పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పియుసి చైర్మన్ కూన రవికుమార్ కృషితో మున్సిపాలిటీకి రూ. 3.50 కోట్లు నిధులు మంజూరు కాబడినట్లు తెలిపారు. ఈ నిధుల నుంచి ప్రతి వార్డులో ప్రతి వీధిలో సీసీ రహదారుల పనులు చురుగ్గా జరుగుతున్నట్లు వెల్లడించారు. ప్రతి వార్డు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, వార్డుల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి తమ్మినేని విద్యాసాగర్, ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు పి.వి.వి.కె. రాజు, 13వ వార్డు అధ్యక్షులు జి.వేణుగోపాలరావు, బూత్ అధ్యక్షలు బగాది రమణమూర్తి, కాంట్రాక్టరు కూన ఆంజనేయులు, మున్సిపల్ ఇంజినీర్ జాన్సన్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.