ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం
ఎల్ నినో సమర్థవంతం ఎదుర్కొందాం…. = పునర్నిర్మాణ పనులు చేపట్టిన కారుమంచి మేజర్ కాలువ ప్రారంభోత్సo = జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడు సూర్య, చీమకుర్తి :
ఎల్ నినో ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కొని రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు జలవనరులశాఖామంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. సోమవారం నిర్వహించిన పునర్నిర్మాణ పనులు చేపట్టిన కారుమంచి మేజర్ కాలువ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు, సంతనూతలపాడు శాసనసభ్యులు బి.ఎన్.విజయ్ కుమార్, ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్ధనరావులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దిగువ ప్రాంతంలో 16 వేలకు పైగా ఎకరాలకు సాగునీరు, 16 గ్రామాలకు తాగునీరు అందించడంలో ఈ మేజర్ కెనాల్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. రైతులు, స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు రూ.2.63 కోట్ల డీఎంఎఫ్ నిధులతో పాటు పి-4 కార్యక్రమం కింద స్థానిక ప్రముఖులు వెంకట శేషయ్య అందించిన రూ.25 లక్షలతో 500 మీటర్ల కాంక్రీట్ గట్టును నిర్మించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా నీటిపారుదల వ్యవస్థను చక్కదిద్దుతున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలోనే నీటి వనరుల నిర్వహణ కోసం రూ.1308 కోట్లు ఇచ్చామన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి ఇదే నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రాయలసీమకు హంద్రీనీవా జలాలు తీసుకురావడంతో పాటు వెలిగొండ ప్రాజెక్టులోకి నీళ్లు, ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలను తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాదికి పూర్తి చేస్తామని ఆయన పునరుద్ఘాటించారు.
కలెక్టర్ మాట్లాడుతూ ఐదు నెలలలోపే ఈ పనులను పూర్తి చేసినందున దిగు ప్రాంతాల్లోని ప్రజలకు త్రాగు, సాగునీటి అవసరాలు తీరబోతున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతంలోని ఇతర పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. 'జలధార - జల హారతి' కార్యక్రమంలో భాగంగా జిల్లాలో మూడువేలకు పైగా పనులను పూర్తి చేసామన్నారు. వర్షాలు వచ్చిన తర్వాత వాటి ఫలితాలు అందుతాయి అన్నారు.
ఎమ్మెల్యే విజయ్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి అవసరమైన సాగునీటి సౌలభ్యం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ఈ దిశగా తీసుకుంటున్న చర్యలే దీనికి నిదర్శనం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వాటర్ మ్యాన్ గా, జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును డిప్యూటీ వాటర్ మ్యాన్ గా దేశవ్యాప్తంగా గుర్తిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. వెలుగొండ, పోలవరం ప్రాజెక్టుల పట్ల వారు చూపిన ప్రత్యేక శ్రద్దే దీనికి కారణం అన్నారు. 2014-19 కాలంలో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రభుత్వం చెక్కు డ్యాములను నిర్మించింది అన్నారు. ఎమ్మెల్యే జనార్ధన్ మాట్లాడుతూ త్రాగు, సాగునీటి అవసరాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఎంతో కీలకమైన వెలుగొండ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ఇటీవల ప్రారంభించారని, ప్రస్తుతం గ్రానైట్ ప్రాంతమైన చీమకుర్తిలో అభివృద్ధికి మరింత ఊతం ఇచ్చేలా అభివృద్ధి పరచిన కారుమంచి కాలువను జల వనరులశాఖా మంత్రి ప్రారంభిస్తుండటం సంతోషకరమన్నారు. ఈనెల 30వ తేదీన ఒంగోలులో నిర్వహించే మున్సిపాలిటీ 150 ఏళ్ల వేడుకలలో పాల్గొనాలని ప్రజలకు ఈ సందర్భంగా జనార్ధన్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ సుచిత్ర, స్థానిక ప్రముఖులు నల్లూరి వెంకట శేషయ్య, ఏఎంసీ చైర్మన్ మన్నం ప్రసాద్, డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లు, స్థానిక ప్రముఖులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.