మంత్రి పొంగూరు నారాయణతో మంత్రి నిమ్మల రామానాయుడు భేటీ
పాలకొల్లు అభివృద్ధి పనులపై సీఆర్‌డీఏ కార్యాలయంలో చర్చలు!
సూర్య ప్రతినిధి: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి, పట్టణ మౌలిక వసతుల కల్పనపై ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు ప్రత్యేక దృష్టి సారించారు. అమరావతిలోని ఏపీ సీఆర్‌డీఏ (APCRDA) ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ/కమిషనర్ ఎస్. సురేష్ కుమార్‌లను మంత్రి నిమ్మల రామానాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ భేటీ సందర్భంగా పాలకొల్లు పురపాలక సంఘం పరిధిలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అభివృద్ధి పనులు, నియోజకవర్గ అవసరాలపై విస్తృతంగా చర్చించారు. ప్రధానంగా పట్టణంలో తాగునీటి సరఫరా వ్యవస్థ మెరుగుదల, డ్రైనేజీ నెట్‌వర్క్ ఆధునీకరణ, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం, మున్సిపల్ పార్కుల సుందరీకరణ మరియు పారిశుద్ధ్య నిర్వహణకు అవసరమైన అదనపు నిధుల మంజూరుపై అధికారులతో సమీక్షించారు. పాలకొల్లు ప్రజల చిరకాల సమస్యల పరిష్కారానికి పట్టణాభివృద్ధి శాఖ నుంచి పూర్తి సహకారం అందించాలని కోరారు.
నియోజకవర్గంలో జరుగుతున్న పనులను వేగవంతం చేయడంతో పాటు కొత్త ప్రతిపాదనలకు సత్వర పరిపాలనా అనుమతులు మంజూరు చేయాలని మంత్రి పొంగూరు నారాయణను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు. పాలకొల్లు పట్టణ రూపురేఖలను మార్చే ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తుందని, నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.