మహిళా కిసాన్ దివస్ సందర్భంగా మహిళా రైతులకు సన్మానం
వింజమూరు మేజర్ న్యూస్ : మహిళా కిసాన్ దివస్ను పురస్కరించుకుని
వింజమూరు సహాయ సంచాలకుల కార్యాలయంలో మహిళా కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు గురువారం సుమారు 50 మంది మహిళా రైతులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి నాలుగు మండలాలకు చెందిన మహిళా రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ అధికారులు, మహిళా వ్యవసాయ సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సహాయ వ్యవసాయ సంచాలకులు ముత్యాల శేషగిరి
మాట్లాడుతూ, వ్యవసాయ రంగంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. విత్తనాలు విత్తడం నుంచి పంట కోత వరకు ప్రతి దశలోనూ మహిళా రైతులు విశేషమైన సేవలు అందిస్తున్నారని, మహిళల భాగస్వామ్యం లేనిదే ప్రస్తుత వ్యవసాయ రంగం మనుగడ సాధించడం కష్టమని వివరించారు. మహిళా సాధికారతకు వ్యవసాయ రంగంలో తగిన గుర్తింపు, ప్రోత్సాహం కల్పించడం ఎంతో అవసరమని తెలిపారు.అనంతరం మహిళా కిసాన్ దివస్ ప్రాముఖ్యత, ఈ దినోత్సవాన్ని నిర్వహించడానికి గల ముఖ్య ఉద్దేశాలు, వ్యవసాయ రంగంలో మహిళలు పోషిస్తున్న పాత్ర, మహిళా సాధికారత తదితర అంశాలపై వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రగతిశీల మహిళా రైతులు ప్రకృతి వ్యవసాయంలో తాము అనుసరిస్తున్న పద్ధతులు, తమ గ్రామాల్లో చేపడుతున్న కార్యక్రమాలు, సాధించిన విజయాలను వివరించారు. వారి అనుభవాలను ఇతర మహిళా రైతులతో పంచుకున్నారు. వ్యవసాయ రంగంలో విశేష ప్రగతి సాధించిన ఐదుగురు మహిళా రైతులను ఈ సందర్భంగా శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు. మహిళా రైతుల కృషికి గుర్తింపు ఇవ్వడంతో పాటు, ఇతర మహిళా రైతులకు స్ఫూర్తినివ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో వింజమూరు వ్యవసాయాధికారి ఏ. వాసు , కలిగిరి మండల వ్యవసాయాధికారి ఎస్.కె. జహీర్ , జలదంకి మండల వ్యవసాయాధికారిణి శ్రీవాణి , నాలుగు మండలాలకు చెందిన మహిళా రైతులు, గ్రామ వ్యవసాయ సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.