మధ్యవర్తిత్వంతో కేసుల పరిష్కారం.. పాలకొండ జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ
పాలకొండ, సూర్య : సుదీర్ఘకాలంగా పేరుకు పోతున్నకేసులసంఖ్యను, త్వరితగతిన పరిష్కరించు కునేందుకు వీలుగా, దేశ అత్యున్నత న్యాయస్థానంతోపాటు, రాష్ట్ర హైకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు,జిల్లాన్యాయసేవాధికారసంస్థ ఆదేశాలతో నిర్వహిస్తున్న "మధ్యవర్తిత్వం - దేశం కోసం" కార్యక్రమాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగపరచుకోవాలని స్థానిక జూనియర్ సివిల్ జడ్జి చందక హరిప్రియ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక జె.ఎఫ్.సి.ఎం.కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన న్యాయఅవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వివిధ కేసులకు సంబంధించి దశాబ్దాలకాలంగా అనేకకేసులు అపరిస్కృతంగా ఉండి పోయాయని, అయితే వీటిలో కొన్నింటిని సముచితమైనమార్గంలో మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకునే అవకాశంఉందని ఆమె వ్యాఖ్యానించారు. దీనినిదృష్టిలో ఉంచుకొని న్యాయశాఖద్వారా ఒక వినూత్నప్రయోగానికి శ్రీకారంచుట్టడం జరిగిందని, ఇందులోభాగంగా ఎంపిక కాబడిన ఐదుగురు న్యాయవాదులను మధ్యవర్తులుగా కోర్టు నియమిస్తుందన్నారు. కక్షిదారులుతమ సమస్యలపట్ల ముందుకువచ్చి, రాజీ కుదుర్చుకునేందుకు సుముఖత వ్యక్తం చేసేసందర్భంలో, కక్షిదారులు నియమించుకున్నన్యాయవాదులతో పాటు, కోర్టు ద్వారా నియమితులైన ఒక న్యాయవాది మధ్యవర్తిగా వ్యవహరించి, ఇరుపక్షాలకు ఎటువంటఅన్యాయం జరగకుండా కేసులు పరిష్కరిస్తారని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఇందుకు కక్షిదారులు ఎటువంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరంలేదని, కేవలం తమఅంగీకారాన్నితెలియచేస్తే మధ్యవర్తిగావ్యవహరించేన్యాయవాది, సమస్యనుపరిష్కరించేందుకు కృషి చేస్తారని, అనంతరం న్యాయస్థానంలో సంబంధిత కేసును సముచితమైన మార్గంలో పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ విధానం వలన కక్షిదారులకు సమయం ఆదాజరగటమే కాకుండా, ఆర్థికవెసులుబాటు దొరుకుతుందని,అలాగే కుటుంబాలు,కక్షిదారులమధ్య వైషమ్యాలుతగ్గి మనస్పర్ధలులేకుండా కలిసిమెలిసి జీవించేందుకు అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా న్యాయస్థానాలపైనకూడా పనిభారం తగ్గి, మిగిలిన కేసుల పరిష్కారం సత్వరం చేపట్టేందుకు వీలుంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా న్యాయవాదులందరూ తమక్షిదారులలో అవగాహన కల్పించి, ఎక్కువ కేసులు రాజీమార్గంలో పరిష్కరించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేయాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పల్లా మునుస్వామి, సీనియర్ న్యాయవాదులు రెడ్డి సంతోష్ కుమార్, శామ్యూల్, ఏ.జి.పి.రౌతు సత్యనారాయణ, అల్లెనశివదాస్, ఎం.జగన్మోహనరావు, తిర్లంగి ఉపేంద్ర కుమార్, ఎన్నిఅఖిల్, బత్తినమోహన్, వై.ఎల్.నాయుడు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : రమణ మూర్తి నాయుడు, పాలకొండ, పార్వతీపురం మన్యం.