మదనపల్లి అభివృద్ధికై డాక్టర్ అప్సర్ షరీఫ్ ని గెలిపించండి : డిసిసి అధ్యక్షులు గాజుల భాస్కర్ పిలుపు
మదనపల్లి,మేజర్ న్యూస్ : మదనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని,చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ ఓటర్లకు పిలుపునిచ్చారు.మంగళవారం పట్టణంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా గాజుల భాస్కర్ మాట్లాడుతూ ప్రస్తుతం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు.పెట్రోల్,డీజిల్,గ్యాస్ ధరలతోపాటు నిత్యావసర ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు దాసోహమంటోందన్నారు.ఏపీలో కూటమి ప్రభుత్వం,ప్రతిపక్ష వైసిపిలు కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నాయని దీంతో రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందన్నారు.విద్యావంతుడైన డాక్టర్ అప్సర్ షరీప్ ని గెలిపిస్తే మదనపల్లి పట్టణాన్ని అభివృద్ధి చేస్తారన్నారు.అనంతరం డాక్టర్ అప్సర్ షరీఫ్ మాట్లాడుతూ తాను వైద్య వృత్తిలో కొనసాగుతున్నానని ప్రజలకు నిస్వార్ధమైన సేవలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ తరపున మదనపల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం,గత వైసిపి ప్రభుత్వం మదనపల్లి అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు.పట్టణంలో తాగునీరు పదిరోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారని దీంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు.రహదారులు గుంతలమయంగా మారడంతో వాహనదారుల బాధలు వర్ణనాతీతమన్నారు.తాను పదవులు ఆశించి,అక్రమ సంపాదన కోసం రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు మేలు చేయడమే తన సంకల్పమన్నారు.ప్రజలు తనకు ఒక అవకాశం కల్పిస్తే మదనపల్లి రూపురేఖలు మారుస్తానని స్పష్టం చేశారు.నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడించారు.కాంగ్రెస్ పార్టీ మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె బాషా మాట్లాడుతూ ప్రజల జీవితాల్లో మార్పు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ క్రమంగా పుంజుకుంటోందని,మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి డాక్టర్ అప్సర్ షరీఫ్ ని ఆదరించి పట్టణ అభివృద్ధికి బాటలు వేయాలని ఓటర్లకు సూచించారు.2029 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం,రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శరత్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ నాయకులు సర్దార్ షరీఫ్,మహబూబ్ షరీఫ్,అయిషా షరీప్,సబీహా షరీప్,ఆలియా షరీఫ్,జాస్మిన్ షరీఫ్,డాక్టర్ నేహా,డాక్టర్ ముష్కాన్,మెహక్ సనా,సమీర్,ఇమ్రాన్,మొయినిద్దీన్,రఫీఖ్ పెద్దఎత్తున పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి