*మడ అడవుల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్ కొణిదెల నాగబాబు** -సంగమేశ్వరం తీరంలో మడ మొక్కలు నాటిన నాగబాబు, బుద్ధప్రసాద్
అవనిగడ్డ మేజర్ న్యూస్: జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఏపీ గ్రీన్ బోర్డు చైర్మన్, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు పిలుపునిచ్చారు. మంగళవారం నాగాయలంక మండలం సంగమేశ్వరం సముద్రతీరంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌తో కలిసి మడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కృష్ణా జిల్లా తీరప్రాంతంలో క్షీణించిన మడ అడవుల పునరుద్ధరణ రెండో దశలో భాగంగా హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకు సహకారంతో, కన్సర్న్ ఇండియా ఫౌండేషన్ భాగస్వామ్యంతో ప్రజా ప్రగతి సేవా సంఘం ఆధ్వర్యంలో 15 లక్షల మడ మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ మడ అడవులు సముద్ర తీరానికి రక్షణ కవచంలా నిలవడమే కాకుండా, మత్స్య సంపద వృద్ధికి, సముద్ర కోత నివారణకు దోహదపడతాయన్నారు. రాష్ట్రంలో 50 శాతం పచ్చదనం సాధించడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని కోరారు.
ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ మడ అడవుల విస్తరణ తీరప్రాంత గ్రామాలకు ఎంతో మేలు చేస్తుందన్నారు. మడ మొక్కలను వంట చెరకు కోసం నరికివేయకుండా వాటి సంరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఉప ముఖ్యమంత్రి సలహాదారు మల్లికార్జున్, ఏపీ గ్రీన్ బోర్డు కమిషనర్, సీఈఓ బీఎన్ఎన్. మూర్తి, అటవీ శాఖ డీఎఫ్ఓ ఏ. త్రిమూర్తులు రెడ్డి, ప్రజా ప్రగతి సేవా సంఘం చైర్మన్ పరుచూరి వెంకటేశ్వరరావు ప్రసంగించారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్త మండలి వెంకట్రామ్, పీసీ చైర్మన్ దేవనబోయిన వెంకటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, అటవీ శాఖ అధికారులు, జనసేన పార్టీ నాయకులు, మాజీ సర్పంచులు, పీఏసీఎస్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, నీటి సంఘాల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు, పెద్దసంఖ్యలో ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.
✍️ అజంతా శ్రీనివాస్, అవనిగడ్డ, కృష్ణాజిల్లా.