లావేరు రోడ్డు దుకాణాల్లోచోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు
చీపురుపల్లి, సూర్య : పట్టణంలోని లావేరు ప్రధాన రహదారిలో టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా కిరాణా షాపుల్లో సోమవారం అర్ధరాత్రి జరిగిన దొంగతనం లో కిరాణా దుకాణంలో రూ.50 వేలు నగదు పోయింది. దుకాణ యజమాని కలివరపు విశ్వేశ్వరరావు తన కిరాణా షాపులో సుమారు రూ. 50 వేల నగదును సరుకులు కొనుగోలు కోసం ఉంచగా దొంగలు పడి తన సొమ్మును దోచుకున్నారని పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమా వెంకటేశ్వరరావు తెలిపారు. దొంగతనం సంఘటన తెలుసుకున్న వైసీపీ జిల్లా అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్ తో పాటు, స్థానిక నాయకులు ఇప్పిలి అనంతం, మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీ, గవిడి సురేష్ సందర్శించారు. పోలీస్ ఉన్నతాధికారులు చీపురుపల్లి లో జరుగుతున్న అక్రమాలపట్ల దృష్టి సారించి సంఘటనా స్థలానికి ఆనుకొని ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి దోషులను పట్టుకోవాలని కోరారు.
రిపోర్టర్ : మధు, చీపురుపల్లి, విజయనగరం జిల్లా.