కొప్పాకలో 'ఐ లవ్ యు పోలీస్' -- దాతల సహకారంతో పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన సీఐ రాజశేఖర్
పెదవేగి, మేజర్ న్యూస్ : ఏలూరు జిల్లా లో వినూత్నంగా నిర్వహించిన ఐ లవ్ యు పోలీస్' కార్యక్రమంలో భాగంగా పెదవేగి ఇన్స్పెక్టర్ సిహెచ్ రాజశేఖర్ కొప్పాక పాఠశాలలో గ్రామములో దాతల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్యాడ్ లను పంపిణీ చేశారు. సమాజంలో పోలీస్ శాఖ పట్ల ప్రజల్లో, ముఖ్యంగా విద్యార్థులలో సత్సంబంధాలు పెంపొందించేందుకు ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ఐ లవ్ యు పోలీస్' కార్యక్రమం నిరంతరం కొనసాగుతోంది. ఇందులో భాగంగా పెదవేగి మండలం కొప్పాక గ్రామంలోని పాఠశాలలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.స్థానిక దాతల సహకారంతో ఈ పాఠశాలలో భద్రతా పరమైన చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు, పదవ తరగతి విద్యార్థినిలకు ప్రత్యేకంగా ప్యాడ్స్ అందచేసినారు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, నూజివీడు డీఎస్పీ కే.వి.వి.ఎన్.వి. ప్రసాద్ ఆదేశాల మేరకు, పెదవేగి ఇన్స్పెక్టర్ సి.హెచ్. రాజశేఖర్ కొప్పాక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ఎంతో చనువుగా, ఆప్యాయంగా మాట్లాడుతూ పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థుల ఆలోచనలను తెలుసుకునే క్రమంలో సరదాగా వారి ఇష్టాయిష్టాలపై చర్చించారు. సినిమాల్లోని హీరోలు, హీరోయిన్ల ఆకర్షణల కంటే. సమాజం కోసం కష్టపడేవారే అసలైన రియల్ హీరోలు మరియు రోల్ మోడల్స్ అని హితవు పలికారు. చదువుకునే పాఠశాలను దేవాలయంగా భావించి, ఉపాధ్యాయులు చెప్పే మంచి విషయాలను శ్రద్ధగా వినాలని సూచించారు. ఆ మార్గాలను చక్కగా ఆచరించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే విద్యార్థుల ప్రథమ ధర్మం అని స్పష్టం చేశారు. విద్యార్థి దశలో అభ్యాసనతో పాటు క్రమశిక్షణ, పెద్దల పట్ల గౌరవం, చట్టాలపై ప్రాథమిక అవగాహన చాలా ముఖ్యమని పేర్కొన్నారు.పోలీసులు అంటే కేవలం శాంతిభద్రతల పరిరక్షణే కాకుండా, విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలోనూ భాగస్వాములు అవుతున్నారని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి నిరూపించారు.
న్యూస్ బ్యూరో బాల సౌరి ఏలూరు ఏలూరు జిల్లా