కూటమిలో బీజేపీకి మొండిచేయి!
కె.గంగవరం మేజర్ న్యూస్ :కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీకి కె.గంగవరం ఎంపీటీసీ స్థానం కేటాయించకపోవడంపై ఆ పార్టీ నాయకుడు కాదా వెంకటరమణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తన తల్లి కాదా అంబావతిని బీజేపీ తరఫున బరిలోకి దించుతూ నామినేషన్ దాఖలు చేయించారు. ఎన్నికల అధికారి శ్రీనివాస్‌కు ఆమె నామినేషన్ పత్రాలు అందజేశారు.కూటమిలో బీజేపీకి తగిన ప్రాధాన్యం కల్పించి, తమకు న్యాయం చేయాలని వెంకటరమణ మండల, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు అధిష్ఠానాన్ని కోరారు. మరోవైపు, కూటమి భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన అభ్యర్థులతో పాటు బీజేపీ తరఫున కూడా నామినేషన్ దాఖలు కావడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.బీజేపీ అధిష్ఠానం అంబావతికి పార్టీ బీ-ఫామ్ కేటాయిస్తుందా? నామినేషన్ ఉపసంహరణకు సూచిస్తుందా? లేక ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో కొనసాగుతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. అధిష్ఠానం నిర్ణయంపై స్థానిక రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.