andhrapradesh
కొండచరియలు విరిగిపడే అవకాశం స్తంభించిన జనజీవనం
తాడేపల్లి న్యూస్ :మురసు తుఫాన్ ప్రభావంతో మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి అల్లకల్లోలంగా మారింది. సోమవారం సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు, ఈదురుగాలులు వీస్తుండటంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నిన్నటి నుండి ఇప్పటివరకు నమోదైన వివరాల ప్రకారం తాడేపల్లిలో అత్యధికంగా 134 మి.మీ., మంగళగిరిలో 133 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది.కొండ ప్రాంతాల ప్రజలకు తీవ్ర హెచ్చరికలుభారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ప్రజలు ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని నగరపాలక సంస్థ విజ్ఞప్తి చేసింది.విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలి భారీ గాలుల వల్ల విద్యుత్ తీగలు తెగిపడే ప్రమాదం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా చిన్నపిల్లలు విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరారు. వర్షపు నీరు నిలిచిన ప్రదేశాలు, నీటి గుంటల వద్దకు పిల్లలను అస్సలు వెళ్లనివ్వకూడదని స్పష్టం చేశారు. 24/7 అత్యవసర కంట్రోల్ రూమ్ ఏర్పాటు తుఫాన్ బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 24/7 కంట్రోల్ రూమ్/కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కమిషనర్ తెలిపారు. నగర పరిధిలో ఎక్కడైనా డ్రైనేజీ సమస్యలు తలెత్తినా, నీరు నిలిచిపోయినా, చెట్లు నేలకొరిగినా వెంటనే కింది నంబర్లకు సమాచారం అందించాలని కోరారు: మొబైల్ నంబర్: 7093912653
ల్యాండ్‌లైన్ నంబర్: 08645-295193 ఫిర్యాదులు అందిన వెంటనే క్షేత్రస్థాయి అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపడతారని, ప్రజలంతా అధికారుల ముందస్తు జాగ్రత్తలను పాటిస్తూ సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు.