కొల్లివలస ఎంపీటీసీగా సివిల్ ఇంజనీర్ యువకుడు
ఆమదాలవలస, సూర్య : ఆమదాలవలస మండలంలో జనసేన పార్టీకి ఒకే ఒక్క కొల్లివలస ఎంపీటీసీ స్థానం కేటాయించారు. ఈ పార్టీ తరఫున పోటీ చేసిన యువకుడు జోగి చందు మనోహర్ (28 సంవత్సరాలు వయస్సు) సివిల్ ఇంజనీర్ (బీ. టెక్ ) పూర్తిచేసి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడ్డారు. ఈ పోటీల్లో 648 ఓట్ల మెజార్టీతో జనసేన పార్టీ నుంచి మండలంలో గెలుపొందిన ఏకైక అభ్యర్థిగా నిలిచారు. బీటెక్ పూర్తి చేసిన యువకుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడంతో ఎంపీటీసీ స్థానంలో గల గ్రామాల ప్రజలు అభినందనలు తెలియజేశారు. రాజకీయం వైపు యువతరం ముందుకు రావడంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని పేర్కొన్నారు. జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన యువకుడికి గ్రామాల ప్రజలు అత్యధిక మెజార్టీలు అందించడం విశేషంగా భావించవచ్చు. బీటెక్ చేసిన యువకుడు తొలి ప్రయత్నంలోనే ఎంపీటీసీగా విజయం సాధించడంపై గ్రామాల్లో ఆనందోత్సవాలతో సంబరాలు చేసుకున్నారు. ఈ ఘన విజయాన్ని అందించిన గ్రామ ఓటర్లకు ఎంపీటీసీ చందు మనోహర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు పూర్తి సహకారాన్ని అందజేస్తానని తెలియజేశారు. రానున్న రోజుల్లో కూటమి తరఫున ప్రజా సంక్షేమాన్ని అందిస్తామని పేర్కొన్నారు. ఈ విజయానికి కృషి చేసిన గ్రామ పెద్దలకు, యువతకు కృతజ్ఞతలు తెలియజేశారు.