కంకిపాడులో ఘోరం.. గేదెల ఫారంలో దారుణ హత్య..
కంకిపాడు మేజర్ న్యూస్ : కృష్ణా జిల్లా కంకిపాడు గ్రామ శివారులోని గేదెల ఫారంలో దారుణ హత్య చోటుచేసుకుంది. బీహార్‌కు చెందిన అనిల్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం రాత్రి ఫారంలో నిద్రిస్తున్న అనిల్‌పై దాడి చేయడంతో సుమారు పది కత్తిపోట్లు తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాలు కాపాడుకునేందుకు సమీపంలోని సిమెంట్ ఇటుకల బట్టీ వద్దకు చేరుకున్న అనిల్, అక్కడ పనిచేస్తున్న కార్మికులను రక్షించాలని వేడుకున్నాడు. దీంతో కార్మికులు యజమానికి సమాచారం అందించి, అంబులెన్స్‌లో అనిల్‌ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న గన్నవరం సబ్‌డివిజన్ డీఎస్పీ జయకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మీడియాతో మాట్లాడారు. రాకేష్, అనిల్ ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారని, రాకేష్‌తో అనిల్‌కు మనస్పర్థలు ఉన్నట్లు విచారణలో తెలిసిందని వెల్లడించారు. ఈ ఘటనలో రాకేష్‌తో పాటు మరికొందరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల పూర్తి కారణాలు, ఘటనలో పాల్గొన్న ఇతర వ్యక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.