ఖండవల్లిలో ఘనంగా చిలకమర్తి జయంతి వేడుకలు
పెరవలి, మేజర్ న్యూస్ : ప్రముఖ కవి, రచయిత, నాటకకర్త, సంఘసంస్కర్త, విద్యావేత్త కీర్తిశేషులు చిలకమర్తి లక్ష్మీ నరసింహం జయంతి వేడుకలను పెరవలి మండలం ఖండవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొవ్వూరు డివిజన్ ఉపవిద్యాశాఖ అధికారి కె.ఆర్.డి. తులసీదాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పరివాహక ప్రాంతంలోని ఖండవల్లి గ్రామంలో జన్మించిన చిలకమర్తి లక్ష్మీ నరసింహం తన సాహితీ ప్రతిభతో విశేష గుర్తింపు పొందారని అన్నారు. తన జన్మస్థలమైన ఖండవల్లికి సాహిత్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం గ్రామస్థులకు గర్వకారణమని పేర్కొన్నారు.
అనంతరం తులసీదాసు ఖండవల్లి పాఠశాల కాంప్లెక్స్‌ను సందర్శించి, అక్కడి నిర్వహణ తీరును పరిశీలించారు. పెరవలి మండల విద్యాధికారి-1 బీవీఎల్ఎన్ ఆనంద్ బాబు, మండల విద్యాధికారి-2 షేక్ సూర్జాన్ చిలకమర్తి లక్ష్మీ నరసింహం సాహిత్య సేవలను కొనియాడారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన రచనలు, హాస్య చతురత, సాహిత్య సేవల గురించి విద్యార్థులకు వివరించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కె. కామాక్షి పద్మప్రియ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉపాధ్యాయులు చిలకమర్తి రచించిన ప్రముఖ పద్యాలను విద్యార్థులకు పరిచయం చేశారు. ఆయన సాహిత్యంలో విద్య, సంస్కృతికి ఇచ్చిన ప్రాధాన్యతను వివరించారు.
చిలకమర్తి లక్ష్మీ నరసింహం రచించిన ‘గయోపాఖ్యానం’ నాటకం ప్రతులు పూర్వకాలంలో లక్షకు పైగా అమ్ముడుపోవడం విశేషమని వక్తలు పేర్కొన్నారు. తెలుగు సాహిత్యం, నాటక రంగానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో పాటు పాఠశాల కాంప్లెక్స్ పరిధిలోని ఉపాధ్యాయులు పాల్గొని చిలకమర్తి లక్ష్మీ నరసింహానికి ఘన నివాళులర్పించారు.