కళాశాల హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య
గుంటూరు : గుoటూరు పట్టణం బ్రాడీపేటలోని మాస్టర్ మైండ్స్ కళాశాల హాస్టల్‌లో ఈనెల 17వ తేదీ రాత్రి సుమారు 9.15 గంటల సమయంలో విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కడప జిల్లా రాజంపేట మండలం గొండివారిపల్లి గ్రామానికి చెందిన సింగన సుబ్బ నరసయ్య కుమారుడు సింగన రవికిరణ్ (20) మాస్టర్ మైండ్స్ కళాశాలలో సిఏ రెండవ సంవత్సరం చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. కొన్ని రోజులుగా రవికిరణ్ కిడ్నీలో రాళ్ల సమస్యతో పాటు కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా తెలిపాడు. సంఘటన జరిగిన రోజు కూడా తీవ్రమైన కడుపునొప్పి, తలనొప్పి ఉన్నట్లు తల్లిదండ్రులకు తెలియజేశాడు.
అదే రోజు రాత్రి కళాశాల ప్రిన్సిపాల్ ఫోన్ చేసి రవికిరణ్ హాస్టల్ గదిలో ఉరి వేసుకున్నాడని, ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారని తండ్రికి సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న తల్లిదండ్రులు గుంటూరుకు చేరుకుని పరిశీలించగా, రవికిరణ్ గదిలో కిడ్నీలో రాళ్ల సమస్యకు సంబంధించిన వైద్య నివేదికలు లభించాయి. తీవ్రమైన కడుపునొప్పిని భరించలేక, కుటుంబ సభ్యులకు దూరంగా ఉండటం వల్ల మానసిక ఆందోళనకు గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని తండ్రి అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు పట్టాభిపురం పోలీసులు బుధవారం
పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి మృతికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టడం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
కే నాగరాజు గుంటూరు క్రైమ్