కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఘన విజయం సాధిస్తాం: *ఎంపీ సానా సతీష్ బాబు
కాకినాడ, మేజర్‌న్యూస్ :
స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సాధించిన ఘన విజయం ప్రజలకు కూటమిపై ఉన్న విశ్వాసానికి నిదర్శనమని రాజ్యసభ ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. కూటమి పార్టీలన్నీ ఒకే కుటుంబంలా సమన్వయంతో పనిచేయడం వల్ల ఇటీవలె నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 100 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాలు సాధించామని, రానున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యతను కొనసాగిస్తూ అన్ని వార్డుల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాకినాడలోని తన కార్యాలయంలో బుధవారం జిల్లా కూటమి నాయకులతో కలిసి నిర్వహించిన ఉమ్మడి మీడియా సమావేశంలో ఎంపీ సానా సతీష్ బాబు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి ప్రజల మద్దతుతో ఘన విజయం సాధించారని తెలిపారు. సీట్ల సర్దుబాటులో కొందరికి పోటీ చేసే అవకాశం దక్కకపోయినా, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, న్యాయం కల్పిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఇప్పటికే కూటమి జిల్లా నాయకత్వంతో చర్చించామని, ఎవరికీ అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు
రానున్న కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ కూటమి ఐక్యంగా పోటీ చేసి ఘన విజయం సాధిస్తుందని ఎంపీ ధీమా వ్యక్తం చేశారు. మేయర్ అభ్యర్థిగా కూటమి అధిష్టానం ఎవరిని నిర్ణయించినా, వారి విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తారని తెలిపారు. కాకినాడలోని అన్ని వార్డుల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు సమన్వయంతో ముందుకు సాగుతామని పేర్కొన్నారు
కూటమి క్రమశిక్షణకు విరుద్ధంగా రెబల్ అభ్యర్థులుగా బరిలోకి దిగేవారి వ్యవహారాన్ని సహించబోమని ఎంపీ స్పష్టం చేశారు. రెబల్ అభ్యర్థులను ప్రోత్సహించే వారిపై కూడా కూటమి పార్టీలు తగిన చర్యలు తీసుకుంటాయని, ప్రతి ఒక్కరూ కూటమి నిర్ణయానికి కట్టుబడి ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
కాకినాడను గంజాయి రహిత, ప్రశాంత నగరంగా తీర్చిదిద్దామని ఎంపీ సానా సతీష్ బాబు పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమమే అజెండాగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రశాంతమైన కాకినాడలో అరాచకాలు, అలజడులు సృష్టించాలని ఎవరైనా ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీని రాజకీయంగా తిరస్కరించారని, ప్రజా మద్దతుతో కూటమి మరింత బలంగా ముందుకు సాగుతుందని అన్నారు.
ఈ మీడియా సమావేశంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్, జనసేన జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, ఎంపీ ఉదయ్ శ్రీనివాస్,, ఎమ్మెల్సీలు పేరాబత్తుల రాజశేఖరం, కర్రి పద్మశ్రీ, రాష్ట్ర సివిల్ సప్లయ్స్ కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, టీడీపీ టౌన్ అధ్యక్షుడు మల్లిపూడి వీరేంద్ర, టీడీపీ నాయకులు పెంకే శ్రీనివాస్ బాబా, బీజేపీ నాయకులు రాంబాల వెంకటేశ్వరరావు, పితాని లీల,, డీసీఎంఎస్ చైర్మన్ పెచ్చేట్టి చందమౌళి, నులుకుర్తి వెంకటేశ్వరరావు తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.