జిల్లాలో రాష్ట్ర సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీలు ....
విజయనగరం, సూర్య : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రభుత్వ సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల (పురుషులు, మహిళలు) రాష్ట్రస్థాయి సివిల్ ఉద్యోగుల క్రీడా పోటీలు–2026 నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలను ఈ నెల 14, 15 తేదీల్లో రాజీవ్ స్టేడియం విజయనగరంలో నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి ఎస్. వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 9 గంటలకు అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, ఖో-ఖో, హాకీ, కబడ్డీ, వాలీబాల్, స్విమ్మింగ్ క్రీడల్లో ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు.
15వ తేదీ ఉదయం 9 గంటలకు క్యారమ్స్, చెస్, క్రికెట్, టేబుల్ టెన్నిస్, పవర్ లిఫ్టింగ్, టగ్ ఆఫ్ వార్, యోగా, టెన్నికాయిట్, రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల్లో ఎంపికలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఉద్యోగులు తదుపరి రాష్ట్రస్థాయి ఉద్యోగుల క్రీడా పోటీలకు పంపబడతారని, రాష్ట్రస్థాయిలో ఎంపికైన వారు జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఉద్యోగుల క్రీడా పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన సివిల్ సర్వీసెస్ ఉద్యోగులు (పురుషులు, మహిళలు) తమ యొక్క స్పోర్ట్స్ మీట్ గుర్తింపు కార్డు, ఆధార్ కార్డుతో సంబంధిత క్రీడా వేదికల వద్ద ఉదయం 9 గంటలకు హాజరుకావాలని కోరారు. మరిన్ని వివరాలకు బి. రూపకుమార్ - 9491767327, 8074116276 - ఏ శ్రీనివాసరావు మొబైల్ నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
యూనిఫార్మ్ సర్వీసెస్‌లోని డిఫెన్స్, పోలీసు శాఖలకు చెందిన ఉద్యోగులు ఈ ఎంపికలకు అనర్హులని, గమనించాలని ఆయన స్పష్టం చేశారు.