జిల్లా విద్యా శాఖ అధికారిని కలిసిన సోమిరెడ్డి రాజు!
ఎస్.రాయవరం, అక్టోబర్ 9, మేజర్ న్యూస్: జిల్లా విద్యా శాఖ అధికారి జి.జి.ఎస్.నాగేశ్వరరావును ఎస్.రాయవరానికి చెందిన సామాజిక కార్యకర్త సోమిరెడ్డి రాజు శుక్రవారం పలు విజ్ఞాపనలతో కలిశారు. ఈ సందర్భంగా ఎస్.రాయవరం మండలంలోని విద్యా సమస్యలపై 3 విజ్ఞాపన పత్రాలను అందజేశారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న భవనాన్ని త్వరగా పూర్తి చేయాలని, కొన్ని దశాబ్దాల క్రితం నిర్మించిన రేకుల షెడ్ శిథిలావస్థకు చేరినందున దాన్ని ఆధునీకరించాలని, వృద్ధాప్యం చెందిన వంట మనుషులను మార్చాలని కోరారు. అలాగే ఎస్.రాయవరం గ్రామంలో బాలబాలికలు తక్కువగా ఉన్న దుబాసి వీధి, రెల్లి వీధి, ఎస్.సి. కాలనీ మండల పరిషత్ పాఠశాలలను విలీనం (మెర్జ్) చేయాలని, వచ్చే విద్యా సంవత్సరం నుండి దుబాసి వీధి పాఠశాలలో మండల పరిషత్ మోడల్ పాఠశాలను తరలించాలని విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞాపనలపై స్పందించిన డీఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ వీటిని విద్యాశాఖ డైరెక్టర్, ఆర్.జె.డి.లకు పంపి, తప్పక తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు సోమిరెడ్డి రాజు విలేకరులకు తెలిపారు.