జి ఆర్ సి ద్వారా మహిళల సమస్యల పరిష్కారం... మంత్రి కొండపల్లి శ్రీనివాస్
గజపతినగరం, సూర్య : జెండర్ రిసోర్స్ సెంటర్ల (జి ఆర్ సి) ద్వారా మహిళల సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో వెలుగు మండల సమాఖ్య బిల్డింగ్ నందు మంగళవారం జి ఆర్ సి సెంటర్ ను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 9 జి.ఆర్.సి సెంటర్లను ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జి ఆర్ సి సెంటర్లు ద్వారా మహిళలు, బాలికలకు రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. జి ఆర్ సి లను దిశ పోలీస్ స్టేషన్ లతో అనుసంధానం చేసి మహిళలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారన్నారు. జి ఆర్ సి లలో చిన్న చిన్న తగాధాలతో, నిరాదరణకు గురైన మహిళలకు అవగాహన కల్పించి ఆలోచన విధానాన్ని మార్చడం కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. జి ఆర్ సి సెంటర్ లో ఉండే స్టీరింగ్ కమిటీ, మహిళా పోలీస్, హెల్త్ అసిస్టెంట్ ద్వారా సమాజంలో మహిళలు ఆదర్శంగా ఉండే విధంగా తర్ఫీదు ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి, డిఆర్డిఏ పిడి శ్రీనివాస పాణి, ఏఎంసీ చైర్మన్ గోపాలరాజు, మక్కువ శ్రీధర్, మండల సమాఖ్య ప్రతినిధులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శంకర్, గజపతినగరం, విజయనగరం జిల్లా.