జీవో 52 ప్రకారం పోస్టులు భర్తీ చేయాలి
మెలియాపుట్టి. అక్టోబర్ 18. మేజర్ న్యూస్...
జీవో నంబర్ 52 ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను భర్తీ చేసి, పశుసంవర్ధక శాఖలో ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదివారం పాతపట్నంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావును కలిసి వినతిపత్రం అందజేశారు.
పశుసంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులను జీవో నంబర్ 52 ప్రకారం భర్తీ చేయడం ద్వారా నిరుద్యోగ వెటర్నరీ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. జీరో వేకెన్సీ పాలసీని అమలు చేయడం ద్వారా శాఖలో సిబ్బంది కొరతను అధిగమించి, పశువైద్య సేవలను మరింత సమర్థంగా అందించేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
పశుసంవర్ధక శాఖను బలోపేతం చేయడంతోపాటు, పశువులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని నియమించాలని కోరారు. పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించి, అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.