జీవీఎంసీ ఎన్నికల్లో పార్టీలను, అభ్యర్థులను నిలదీయండి
సీతమ్మధార, సూర్య : నగర సమస్యలను పాలకులు గాలికి వదిలేసి దగా చేస్తున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం(పీవో డబ్ల్యూ) రాష్ట్ర అధ్యక్షురాలు ఎం .లక్ష్మి ధ్వజమెత్తారు. నగరంలోని ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నగర సమస్యలపై చర్చ జరగకుండా ఎవరేం చేస్తారో వెల్లడించకుండా హడావిడిగా ఎన్నికలు జరుగుతున్నాయని దుయ్యబట్టారు. జీవీఎంసీ ఎన్నికలను నేపథ్యంలో పార్టీలనూ, అభ్యర్థులనూ నిలదీయాలని నగర ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ,ఉదయం 10-30గం.లకు నగరంలోని దొండపర్తి డిఆర్ ఎం కార్యాలయం నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ప్రజా ర్యాలీ, అనంతరం బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ మేరకు ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మేయర్ అభ్యర్థులను ఆహ్వానిస్తున్నామని నగర సమస్యలపై వారి అజెండా బహిరంగంగా ప్రకటించాలని కోరతా మన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయంత చేయాలని పిలుపునిచ్చారు. బీచ్ సాక్స్ పేరుతో మద్యం అమ్మకాలు నిర్వహిస్తే ఒప్పుకోమన్నారు . ఆపరేషన్ లంగ్స్ పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేసారని, వారికి ప్రత్యామ్నయం కల్పిస్తున్న హామీ అమలు చేయలేదన్నారు. ఐఎఫ్ టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నగరంలో రోడ్లు, మంచినీరు, పారిశుధ్యం, అభివృద్ధి పనులు అంతంత మాత్రం గానే ఉన్నాయని వాటిని పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యాలన్నారు. ఇంటి పన్నులు, ఇతర పనుల భారాన్ని పెంచి ప్రజలతో మోపారన్నారు.
కళ్యాణ మండపాలు, పార్కులు ప్రైవేటీకరించి ప్రజలపై పేదలకు అందుబాటులో లేకుండా చేస్తున్నారన్నారు. నగరంలోని టిడ్కో రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నగరంలోని పేదలకు రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు, నాలుగున్నర లక్షల నిధులు కేటాయింపు ఏదనిప్రశ్నించారు. డేటా సెంటర్లకు, టూరిస్ట్ ప్రాజెక్టులకు వందలాది ఎకరాల కేటాయింపు తగదన్నారు. 50శాతం నగర ప్రజలు మురికివాడల్లో నివాసం ఉంటున్నారని, జీవీఎంసీ బడ్జెట్ లో 40శాతం నిధులు కేటాయించాలని చట్టాలు చెబుతున్న అమలు కావటంలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా అధ్యక్షురాలు కె .బాలనాగమ్మ, మురికివాడల నివాసుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు ఈసర లక్ష్మి, పిఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్ వెంకటలక్ష్మి, డి. రోహిణి దేవి, ఐఎఫ్ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పి .లక్ష్మి, కె .రామారావు, నాగమణి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.