జెడ్పీహెచ్‌ఎస్ పాములపాడులో ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవ అవగాహన కార్యక్రమం
పాములపాడు: మేజర్ న్యూస్ స్థానిక జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అక్టోబర్ 29న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు మానసిక ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంఈఓ బాలాజీ నాయక్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఈఓ బాలాజీ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. చదువులో ఒత్తిడి, పరీక్షల భయం, వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు వాటిని మనసులో దాచుకోకుండా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, కౌన్సిలర్లతో పంచుకోవాలని తెలిపారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల భావోద్వేగాలను అర్థం చేసుకోవడం, వారి సమస్యలను సానుకూలంగా పరిష్కరించడం, పాఠశాలలో స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయురాలు హైమావతి మాట్లాడుతూ విద్యార్థులు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరచాలని, అవసరమైనప్పుడు సహాయం కోరడానికి వెనుకాడకూడదని సూచించారు.
సీనియర్ ఉపాధ్యాయులు స్వామిశేఖర్ మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించుకోవడానికి క్రమబద్ధమైన జీవనశైలి, తగినంత నిద్ర, వ్యాయామం, సానుకూల ఆలోచనలు అవసరమని వివరించారు.
కౌన్సిలర్లు టి. నాగమణి, ప్రమీల, జి. రంగనాయకులు మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ప్రతి ఒక్కరికీ ముఖ్యమని తెలిపారు. ఆందోళన, భయం, బాధ, ఒంటరితనం వంటి భావాలను గుర్తించి అవసరమైనప్పుడు కౌన్సిలింగ్ సహాయం పొందాలని సూచించారు. ఇతరుల సమస్యలను ఎగతాళి చేయకుండా, వారిని అర్థం చేసుకుని ప్రోత్సహించాలని విద్యార్థులకు తెలియజేశారు.
అనంతరం విద్యార్థులతో మానసిక ఆరోగ్య పరిరక్షణపై ప్రతిజ్ఞ చేయించారు. మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన పెంపొందించుకోవడంతో పాటు, అవసరమైన సమయంలో ఇతరులకు అండగా నిలవాలని ఈ కార్యక్రమం ద్వారా సందేశాన్ని అందించారు